ఎదుగుతున్న ప్రతీ మనిషికి తపన పడేది గుర్తింపు కోసం. అది చాలా మంది చాలా రకాలుగా పొందాలని ఆశపడతారు. అలా ఆశపడిన వాళ్లలో నేనూ ఒకడిని. చప్పట్ల కోసం , మెప్పు కోసం ఎప్పుడూ పరితపించేవాడ్ని. దానికోసం అవతలి వాళ్లకి నచ్చినట్టు మసలుకోవటం ఒక అవసరంగా మారిపోయింది. దానికి తగట్టు జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచ్చుకున్నా. నా తెలివితో, పనితో, చదువుతో, వాక్పటిమతో అవతల వాళ్ళతో అద్భుతం అనిపించుకున్న సన్నివేశాలు ఎన్నో చూశా. కానీ ఒకసారి అవతల వాళ్ళ చెప్పట్లు చూసిన కళ్ళు, అవతల వాళ్ల మెప్పు విన్న చెవులు, ఆ ప్రశంసలు ఆగిపోతే తట్టుకోలేవు. అలా అని మనల్ని మెచ్చే జనాలు కదా మనం ఏం చేసినా నడుస్తుందిలే అనుకుంటే, అది తప్పు. జనాలకి మన మీద ఆ ఆశ ఎప్పటికీ ఉంటుంది. అదే ఒక రోజు నాకు తట్టింది. ఆ ఆలోచన నా జీవితంలో ఎంతో మార్పు తీసుకు రావటంలో బీజం వేసింది. ఇన్నాళ్లు అవతల వాళ్ళ కోసం ఎన్నో పనులు చేసాను, కానీ అసలు నా వ్యక్తిత్వం అంటే ఏంటి? అని ఒకసారి నన్ను నేను ప్రశించుకున్నా.
వొచ్చిన సమాధానం నన్ను కుదిపేసింది. నాకంటూ ఇష్టాలు లేవు, వ్యక్తిత్వం లేదు. అవతల వాళ్ళ మెప్పుని కోరి నా మనసుకి వాళ్ళని యజమానిని చేశా. అది ఎప్పుడూ ఆ మెప్పు కోసం, వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఆడటం ప్రారంభించింది. అప్పుడు ఆ ఆట ఆపమన్నా ఆపే స్థితిలో అది లేదు. దాన్ని ఇప్పుడిప్పుడే చిన్నగా దారి మళ్లించుకుంటున్నా, కానీ అది బాగా సమయం పట్టే విషయం. అంటే ఇప్పటివరకు నేను అందరి దృష్టిలో డిస్టింక్షన్ లో పాస్ అయ్యా కానీ. నా గురించి నన్ను, నేను మార్కులు వేసుకుంటే మాత్రం ఇంతకుముందు సున్నా వేసుకునే వాడ్ని, ఇప్పుడైతే, ఒకటో రెండు మార్కులు వొస్తాయి ఏమో! అంటే నాలో నేను, నాకోసం నేను సాధించాల్సింది ఎంతో ఉంది. అనుభవం మీద చెప్తున్నా మిత్రులారా అవతల వాళ్ళని నొప్పించకుండా, మనకి నచ్చినట్టు బతకాలి, అంతే కాని అవతల వాళ్లకి నచ్చినట్టు, మనల్ని మనం నొప్పించుకోకుండా బతకాలి అనుకుంటే మాత్రం, నీ రెండు పాదలతో నువ్వు ప్రంపంచాన్ని చుట్టినా, నీ మనసులో లో మాత్రం ఒక అంగుళం కూడా ముందుకు పోలేవు.
అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అంత లోతైన సామెత అది......
జీవితం నిటారుగా గీసిన గీతా కాదు, నిలువుటద్దమూ కాదు, అదొక గజిబిజి ప్రయాణం. చిన్నప్పుడు పుస్తకంలో పాఠాలు ఉన్నట్టు, ఒకదాని వెంబడి ఒకటి ఉండవు. అలాగని సులువైన ప్రశ్న ముందు రాద్దామనుకుంటే, ప్రశ్నపత్రంలా మనకి అన్ని ప్రశ్నలూ ఒకేసారి కనపడవు. అందుకేనేమో బాగా చదివిన పిల్లాడు కూడా, జీవితంలో తడబడతాడు. కానీ తడబడిన ప్రతివాడు పడిపోడు, చాలా మంది నిలబడడానికే ప్రయత్నిస్తారు. అలా ఒక్కళ్ళే ప్రయత్నించడం కష్టం కనుక, ఒక తోడుని కట్టబెడతారు. ఆ తరువాత వాళ్ళ అలంబనతో చాలా మంది అలా గట్టెక్కిపోతుంటారు. చిత్రం గమనించారా! ఒక పుస్తకం చదవాలి అంటే మొదటి నుంచి చివరికి చదవాలి, కానీ ఒక జీవితం చదవాలి అంటే చివరి నుంచి మొదలుకి రావాలి.
నా జీవితంలో పైన చెప్పిన విషయానికి సరిగ్గా సరిపోయే సంఘటన చెప్తా.. ఒక నాడు నేను ఆటో కోసం ఎదురు చూస్తున్నా, ఒక షేర్ ఆటో అతను వొచ్చారు, నేను నలుగురితో పాటు ఎక్కా, నా జేబులో సరిగ్గా 15 రూపాయలు ఉన్నాయి. ఆటో సగం దూరం పోయేసరికి నాతో ఉన్నవాళ్ళంతా దిగేసారు. ఇంక ఆ ఆటో అతను, నన్ను కూడా దిగిపోమన్నారు. సగంలో దింపాడు కనుక సగం డబ్బులే అంటే 5 రూపాయలే ఇచ్చాను. మిగితా దూరం నడుచుకుంటూ వొస్తుంటే, దారిలో ఒకతను ఒక పెద్ద దేవుని బొమ్మ అగ్గిపుల్లతో గీస్తున్నారు. నేను అలాంటి విద్య చూడటం అదే మొదటిసారి. చప్పున నా జేబులో ఉన్న 10 రూపాయలు తీసి అతనికిచ్చేసా.
ఇప్పుడు ఇదే సంఘటన వెనక్కి చదవండి, నేను ఆ బొమ్మ వేసే అతనికి పది రూపాయలు ఇవ్వాలి కాబట్టి, ఆటో అతను నన్ను సగం దారిలో దింపేసాడు. అతనికి నేను పది రూపాయలే ఇవ్వాలి కాబట్టి ఆరోజు నా జేబులో కేవలం 15 రూపాయలే ఉన్నాయి, అది జరగాలి కాబట్టే నాతో ప్రయాణించిన వాళ్ళు అందరూ మధ్యలో దిగిపోయారు.
అందుకే జీవితం నిటారుగా గీసిన గీతా కాదు, నిలువుటద్దమూ కాదు....!
మొదలుపెట్టేటప్పుడు తడబాటు సహజం అది నడక అయినా మాట అయినా మరింకే మంచి ప్రయత్నం అయినా. కానీ ఆ తడబాటుని ఆస్వాదించే నేను, తరువాత జరిగే పొరపాట్లని మాత్రం సహించలేకపోతున్నా. అందుకు నేను అనుకునే కారణం కొంచెం దూరం ప్రయాణం సాగంగానే, ఇంక మనం అలల్ని దాటేసాం కదా ఇంకేం భయం అనుకుంటా. కానీ వొచ్చే తుపానుని మాత్రం అంచనా వెయ్యలేకపోతున్న. ఇలా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక సినిమాలో ఒక మంచి వాక్యం విన్నా. ఒక ముసలావిడ ఒక కుర్రవాడికి piano ఎలా వాయించాలో నేర్పిస్తూ చెప్పే మాట అది, " చూడు నువ్వు ఎలా వాయిస్తున్నావో ముఖ్యం కాదు, వాయించేటప్పుడు నువ్వు ఎలా ఆస్వాదిస్తున్నావో ముఖ్యం" ఎందుకో, నాకు ఆ మాట చాలా బలంగా తగిలింది. ఒడిడుకులు లేని జీవితం, తుపాను రాని పడవ ప్రయాణం ఉండవు. కానీ, ఆ ప్రయాణం లో నేను గెలుపు ఓటముల్ని బేరీజు వేసుకుంటే, నేను ఎప్పుడూ ఒడిపోతూనే ఉంటా, కానీ నేను ప్రయాణాన్ని ఆస్వాదించడం తెలుసుకుంటే, అప్పుడు నాకు గెలుపు, ఓటములతో సంబంధం ఉండదు. ఆ స్థితికి నేను చేరుకోగలిగేతే, ఇంక నాకు ఎప్పుడూ ఆనందమే. నాకు నేను అనుభవం మీద తెలుసుకున్న, ఇంకా నాకు బాగా కావలిసిన వాళ్ళు చెప్పిన గొప్ప సత్యం చెప్తా:
సుఖం వేరు సంతోషం వేరు
ఓటమి వేరు బాధ వేరు
విజయం వేరు ఆనందం వేరు
నేను స్వయంగా, మరియూ చాలా మంది జీవితాల్లో నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటి అంటే, మనం ఒకదానితో ఒకటి ముడి పెడతాం. ఒక దానికి ఇంకొకటి ఆధారం అనుకుంటాం. కానే కావు. నేను మెత్తటి పరుపు మీద పడుకుంటే నాకు సుఖం ఉంటుంది కానీ, నా మనసులో అలజడి ఉంటే సంతోషం ఉండదు. ఈ కిటుకు నాకు తెలియడానికి 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇంకా అది మనసులోకి నిలబడలేదు. అలా నిలబడిన రోజున ఇంక ఎన్ని తుఫానులు వొచ్చిన నా కళ్ళు మెరిసే మెరుపుల్ని చూసి మురిసిపోతాయి కానీ, మునిగే పడవని చూసి చలించవు.... ఆ రోజు రావాలని ఆశిస్తూ.....
ఆ ఆటలకి ఒక పద్దతి, తీరు ఉండేది కాదు. నియమాలు మేము పెట్టుకునేవే, కానీ మేమే మళ్ళీ వాటిని తిరగరాసేవాళ్ళం. వాటికి ఒక సమయం సందర్భం, ఒక వాతావరణం, ఒక గాంభీర్యం, ఒక మనసు బాగుండడం బాగోకపోవటం ఇవి ఏవీ ఉండేవి కాదు.
'కావాల్సింది 'అల్లా'(దేవుడు) ఒక్కటే, అమ్మ నుంచి సరే అనో, మ్మ్ అనో ఒక ఒప్పిక మాత్రమే.
అంతకు మించి ఆడుకోవడానికి స్థలం వున్నా లేకపోయినా, బ్యాట్ బాల్ ఉన్న లేకపోయినా, అరువుతెచ్చుకోనైన ఆడితీరవాల్సిందే. అదొక ఉక్కు సంకల్పం. ఎందుకు అంటే అందులో ఒక స్వేచ్ఛ ఉంది, నవ్వులు ఉన్నాయి, ఇష్టమైన వాళ్ళతో ఓడిపోవడం ఉంది, కిందపడి దోక్కొని పోవటం లాంటి చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళతోనే మళ్ళీ అంతే ఉత్సహంతో ఆడే పెద్ద మనసులున్నాయి, మనల్ని గెలిచినవాడ్ని మనం ఈసారైనా గెలవాలనే బుజ్జి పట్టుదలలున్నాయి. అవతలవాళ్ళని నొప్పించుకుండా వుండే వెక్కిరింతలు,అవతల వాడి దెబ్బకి మందు రాసే సున్నితమైన సన్నివేశాలు ఉన్నాయి.
పేద వాడు చాచి బంతిని తంతే, తన వెనక ఉన్న నోట్ల కట్టల్ని మరిచిపోయి ఆ బంతి వెనక పరిగెత్తే గొప్పవాడి కమ్యూనిజం ఉంది. అక్కడ తీర్పు వొచ్చక అందరూ పాటిస్తారు, ఆ తీర్పు కూడా అందరూ కలిసి ఇచ్చుకునేదే, అంత గొప్ప ప్రజాస్వామ్యం ఉంది.
అందుకేనేమో, ఊరెళ్ళాల్సిన సమయం వొచ్చినా, ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా, ఒంట్లో బాగోకపోయినా, ఇంకొక్క ఓవర్, ఇంకొక్క మ్యాచ్ అంటూ సాగతీసేవాళ్ళం. ఒక్కరి చేతికి కూడా గడియారం ఉండేది కాదు. అలసట, ఆకలి, మంచి వర్షం, చిమ్మ చీకటి, నాన్న అరుపు, అన్న పిలుపు,అమ్మ గదమాయింపు, ఇవే మమ్మల్ని ఆపగలిగే శక్తులు. అంతే కాని కాలానికి లోంగే వాళ్ళం కాదు.
ఇంత ఆడిన తరువాత సోడా బండి ఆయన దగ్గరికి వెళ్లి అందరి డబ్బులు పోగేసుకొని, గెలుపోటములని మర్చిపోయి తలోక రెండు గ్లాసుల సోడా తాగి, బంతికి అంటిన మట్టిని, మనసుకి అంటుకుందామని చూసిన పొగడ్తల్ని, తిట్లని దులిపేసుకొని నిర్మలంగా ఇంటికి వెళ్లిపోయేవాళ్ళం.
నిజమే, ఆ ఆటలకి ఒక పద్దతి, తీరు ఉండేది కాదు......
(సశేషం)