Soldier in Telugu Short Stories by M C V SUBBA RAO books and stories PDF | సైనికుడు

Featured Books
  • दोस्तों के गाँव की यात्रा - 3

    सीन 34: (घर की छत पर सबने अपनी-अपनी चादरें बिछा ली हैं, टॉर्...

  • सनम - 3

    काफ़ी शॉप शहर के सबसे शांत कोने में थी। बाहर की भीड़भाड़ से...

  • You Are My Choice - 54

    "तो... स्कूल टाइम में तुम्हारी क्रश कौन थी?" "यस।" विद्या ने...

  • बाजार - 10

    बाजार ... (10 )                               तुम सत्य को कि...

  • Kurbaan Hua - Chapter 27

    डिनर टेबल पर नई बातें और पुरानी यादेंविशाल धीरे-धीरे बंगले क...

Categories
Share

సైనికుడు

సైనికుడు

" ఏరా సుధాకర్ రేపే కదా నీ ప్రయాణం. మళ్లీ ఎప్పుడు వస్తావు? ఈసారి ఎందుకో చాలా బెంగగా ఉంది. నేను మీ అమ్మ ఇలా మంచాన్ని పడి ఉన్నా ము. నువ్వేమో చాలా దూరంగా ఉన్నావు. అప్పుడు మేము చెప్పిన వినలేదు నీ స్నేహితులందరినీ చూసి నువ్వు ఈ ఆర్మీలో జాయిన్ అయ్యావు. మేం పెద్దవాళ్ళం అయిపోయి ఉన్నాము.మా గురించి ఏ కబుర్లు తెలిసిన నీకు వెంటనే రావడం కుదరదు. ఎక్కడో వేల మైళ్ల దూరం నుంచి రావాలి. అప్పటివరకు మమ్మల్ని ఆ పెట్టెలో పెట్టి ఉంచుతారు. అలాంటివన్నీ తలుచుకుంటే మాకు చాలా భయంగా ఉంది. ఉన్న ఒక్క కొడుకు చేతితో ఉత్తరక్రియలు జరిపించుకోవాలని కానీ వేళ కు నువ్వు అందుకో లేకపోతే యిన్నాళ్ళ నుంచి చాకిరి చేస్తున్న కోడలు పిల్ల చేతితో ఆ కార్యక్రమం జరిగేలా చూడు. ప్రస్తుతం అది కొడుకు లాగే చూసుకుంటుంది. వేరొకరి చేత కార్యక్రమం జరిపించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇది మా ఆఖరి కోరిక.

పేపర్లలో టీవీల్లో సరిహద్దులో జరిగే అలజడి గురించి ఏ వార్త వచ్చినా మేము తట్టుకోలేకుండా ఉన్నాము. కనీసం పిల్లలు ఆడుకునే దీపావళి తుపాకీ శబ్దం విన్న మాకు భయంగా ఉంటోంది. 

ఆ ఎండ వానల్లో కొండ కోనల్లో దేశ సరిహద్దుల్లో ఆ మంచు కొండల్లో ఇరవై నాలుగు గంటలు దేశ సేవలో నిమగ్నమై ఉండే వేళకి ఇంత అన్నం తిన్నావా లేదా అని బెంగగా ఉంటుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన తల్లి లచ్చమ్మ కి తండ్రి రామయ్య కి మాటలకి సుధాకర్ కి ఏడుపొచ్చింది. ఎప్పుడు లేనిది ఇవాళ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి? వాళ్ల భయంలో అర్థం ఉంది. ముసలి వాళ్లు కదా. ఏం చేయాలి.వృత్తి బాధ్యత తప్పదు తప్పకుండా వెళ్లాలి అనుకుంటూ తనలో తాను బాధపడుతూ అవును రేపే నా ప్రయాణం అంటూ సమాధానం ఇచ్చాడు సుధాకర్. నేను ఉద్యోగం లో జాయిన్ అయిపోయి 10 సంవత్సరాల పైన అయింది. ఈసారి రిజైన్ చేసి వస్తా ను. మన ఊళ్లోనే మీ దగ్గర ఉండిపోతాను. ఉన్న ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటాను. మీరు బెంగ పెట్టుకోకండి. ఈ విషయాలన్నీ నేను రమ్యతో చెప్తాను. మీరేమీ కంగారు పడకండి.
 అంటూ సమాధానం చెప్పాడు సుధాకర్.    

లచ్చమ్మ రామయ్య ఏకైక సంతానం సుధాకర్. పొత్తిళ్ళలో ఉన్నప్పుడు సుధాకర్ ని చూసి పండు లా ఉన్నాడు అనుకునేది లచ్చమ్మ. పెరిగి పెద్దవాడైన తర్వాత వీధిలో నడిచి వెళ్తుంటే రాజు లా ఉన్నాడు అనుకునేవారు ఆ ఊరి వాళ్లు . ఏ రాజ్యానికి రాజు కాలేదు కానీ సుధాకర్ దేశ రక్షణలో సైనికుడిగా జాయిన్ అయిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వద్దన్నా వినకుండా దేశ రక్షణ లో ఉపాధి వెతుక్కున్నాడు సుధాకర్. తల్లిదండ్రులు చేసేదిలేక మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు.
 సెలవు దొరికినప్పుడల్లా సొంత ఊరు వచ్చి సెలవు దొరికి నన్ని రోజులు ఉండి వెళ్తుంటాడు. సుధాకర్ భార్య రమ్య ఇద్దరు బిడ్డలను అత్తగారిని మామగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. భర్త ఎప్పుడు రిజైన్ చేసి వస్తాడాని ఎదురు చూస్తూ ఉంటుంది.

సుధాకర్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు కానీ మనసు మనసులో లేదు.నిజమే మిగతా ఉద్యోగాలకి దేశ రక్షణ ఉద్యోగాలకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సెలవు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చే ఉద్యోగాలు కాదు. ఆదివారం పూట కుటుంబంతో ఆనందంగా గడిపే ఉద్యోగం కాదు. ఎప్పుడూ ఒత్తిడితో పని చేయవలసి ఉంటుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తుంటారు సైనికులు. ఎప్పుడు శత్రువుల తుపాకీ గుళ్ళకు బలి అవుతారో తెలియదు. కనీసం శవం కూడా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి. రాత్రిపూట కంటి నిండా కునుకు ఉండదు. బయట ప్రపంచ o తోటి సంబంధం ఉండదు. చుట్టూ ఎటు చూసినా మంచుకొండలు తుపాకీ గుళ్ళ శబ్దం, తన తోటి ఉద్యోగులు తప్పితే మరో ప్రపంచం కనబడదు. పండగలు పబ్బాలు కుటుంబ సభ్యులతో చేసుకునే అదృష్టం చాలా తక్కువ. ఇంకొక ఆరు నెలలు గడిపేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేయొచ్చు. హాయిగా సొంత ఊరిలో తల్లిదండ్రులతో భార్యా పిల్లలతో గడపొచ్చు అనుకుంటూ మర్నాడు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయాడు సుధాకర్. 

రెండు నెలలు సెలవు పెట్టి వచ్చిన సుధాకర్ ఇంకా పదిహేను రోజులు సెలవు ఉందనగా ఎందుకు వెళ్లిపోయాడో భార్యకు అర్థం కాలేదు. సరిహద్దుల్లో పరిస్థితి బాగోలేదని వెంటనే వచ్చిన జాయిన్ అవమని ఫోన్ వచ్చిందని విషయం సుధాకర్ ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం ఇంట్లో చెప్తే కంగారు పడతారని ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు సుధాకర్. ముప్పై గంటల ప్రయాణం. గమ్యస్థానం చేరగానే విధి నిర్వహణ. ఊపిరి సలపని పని . విపరీతమైన ఒత్తిడి. వెళ్లిన తర్వాత వెంటనే ఫోన్ చేయలేకపోయాడు.  

రోజు సుధాకర్ తో మాట్లాడితే గాని తోచని తల్లిదండ్రులు సుధాకర్ నుంచి ఫోన్ రాకపోయేసరికి తల్లడిల్లిపోయారు. దానికి తోడు రోజు టీవీలో వార్తలు చూసే సుధాకర్ తల్లి తండ్రులు భార్య మరింత ఆందోళన పడిపోయా రు. ఇదివరకు అయితే మర్నాడు పేపర్ వచ్చేవరకు వార్తలు తెలిసేవు కావు. ఇప్పుడు సాంకేతికత పెరిగి ఎప్పటికప్పుడు తాజా వార్తలు అన్ని టీవీ ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు. దాంతో ప్రపంచంలో ఏమి జరిగినా నిమిషాల మీద ఆ వార్త ప్రపంచమంతా తెలిసిపోతుంది. భారత సరిహద్దుల్లో పదిమంది సైనికులు చనిపోయారని వచ్చిన ఒక వార్త సుధాకర్ భార్యని తల్లిదండ్రులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ చనిపోయిన సైనికుల పేర్లు చెప్పరు. 

అలా మూడు రోజుల తర్వాత ఒక తెలియని నెంబర్ నుంచి ఫోను వచ్చింది రమ్య కి. హలో అనగానే అవతల వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. హిందీ భాష అర్థం కాక రమ్య పరిగెత్తుకుంటూ పక్కింటి వాళ్ళ అబ్బాయికి ఆ ఫోన్ ఇచ్చి మాట్లాడించింది. శత్రుమూకల కాల్పుల్లో సుధాకర్ చనిపోయాడని శవం ఇంకా దొరకలేదని గాలింపులు చేస్తున్నామని దొరికిన తర్వాత సొంత ఊరికి పంపిస్తామని అవతల నుంచి చెప్పిన మాట ఫోన్ పెట్టేసిన తర్వాత అబ్బాయి చెప్పగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గదిలోకి పోయి మంచం మీద ఏడుస్తూ పడుకుని ఉండిపోయింది రమ్య.ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఆ ముసలి తల్లిదండ్రులకి కబురు ఎలా చెప్పాలి. ఈ కబురు విని వాళ్ళ తట్టుకోగలరా! రేపొద్దున్న పిల్లలు పరిస్థితి ఏమిటి భగవంతుడు ఏమిటి ఇలాంటి శిక్ష వేశాడు. ఈ వార్త ఆ నోట ఈ నోటా తెలిసి ఊరి వాళ్లంతా ఏడుస్తూ సుధాకర్ ఇంటికి రావడం ప్రారంభించారు. గదిలో పడుకుని ఏడుస్తున్న కోడల్ని ఇంటికి వచ్చిన ఊరి వాళ్ళని చూసి ఎవరూ చెప్పకుండానే పరిస్థితి అర్థం చేసుకొని సుధాకర్ తల్లిదండ్రులు మంచం మీద పడుకుని ఏడవడం ప్రారంభించారు.

అలా మధ్యాహ్నo మూడు గంటలు అయింది. ఎవరికీ తిండి తిప్పలు లేవు. ఇంతలో టేబుల్ మీద ఉన్న రమ్య సెల్ ఫోన్. మోగింది. ఉదయం వచ్చిన నెంబర్ నుంచి మళ్లీ కాల్ వచ్చింది. పక్కింటి అబ్బాయిని పిలిచి ఫోన్ ఎత్తమని చెప్పింది. హలో అనగానే అవతల వాళ్ళు చెప్పిన మాట విని అబ్బాయి కళ్ళల్లో ఆనందం కనిపించింది. చనిపోయింది సుధాకర్ కాదని సుభాకర్ అనే సైనికుడని పొరపాటు సమాచారం అందించినందుకు క్షమించమని చెప్పారు. ఆ తర్వాత సాయంకాలం సుధాకర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నెట్వర్క్ సరిగా పనిచేయని కారణంగా ఫోన్ చేయలేకపోయానని తను వేరే పోస్ట్ కు బదిలీ అయ్యానని చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆరు నెలలకి సుధాకర్ రిజైన్ చేసి వచ్చేసి తల్లిదండ్రులతో భార్యతో హాయిగా కాలక్షేపం చేయసాగాడు. 

కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు. ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. మనిషికి అన్ని భయాల్లోకి ప్రాణం భయం ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కడలేని ఒత్తిడి పెంచుతుంది. సైన్యంలో పనిచేసే వారికి ప్రాణ భయం ఎక్కువ ఉంటుంది. అది ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇన్నాళ్ళు ఇలాంటి ఒత్తిడి ఎదుర్కొన్న సుధాకర్ కి ఉన్నట్టుండి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశాడు. ఆ కుటుంబం పరిస్థితి తలకిందులైంది.

 సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువగా ఉంటుందని అనుకుంటే ప్రశాంతంగా బ్రతుకుతున్న సుధాకరు జీవితం కూడా గాల్లో కలిసిపోయింది. జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. కొద్దిరోజులకి బెంగతో సుధాకర్ తల్లి తండ్రులు కూడా కన్నుమూశారు. అన్నింటికీ రమ్య తానే కర్త అయ్యి కార్యక్రమం ముందుకు నడిపించింది. ఆ తర్వాత చిన్న వయసులో ఉన్న రమ్య ని పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది ముందుకు వచ్చారు. రమ్య అందుకు ససేమేరా ఒప్పుకోలేదు.భర్త ఎక్కడో దూరంగా ఉన్నా నైతిక విలువలకు కట్టుబడి ఉండి గుట్టుగా సంసారాన్ని తనకు అప్ప చెప్పిన బాధ్యతని సక్రమంగా నడిపించిన రమ్య మళ్లీ ఇప్పుడు తన మీదనున్న బాధ్యతల్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి నడుము కట్టింది . దేశ రక్షణకు సైన్యంలో చేరి జీవితం త్యాగం చేసిన సుధాకర్ ఎంత గొప్పవాడో అలాగే రమ్య లాంటి ఎంతోమంది సైనికుల భార్యలు నిజంగా త్యాగమూర్తులు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279