ప్రతి రోజూ ఏదో ఒక బాధ్యతతో మన రోజు మొదలవుతుంది. మన గురించి ఆలోచించే సమయం మనకే దొరకదు. మనిషి తనకోసం, కాక పోయినా తనవాళ్ల కోసం ఏదైనా చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి పొందాలంటే ఇంకేదో వదులుకోవాల్సి వస్తుంది.
ఈ బిజీ జీవితంలో మనం ఒక చిన్న విరామం తీసుకోవాలని అనుకున్నా, దానికి కూడా వెసులుబాటు దొరకదు. మధ్యతరగతి జీవితాన్ని గడిపే వారే ఎక్కువ. నెలాఖరుకి ఖర్చులకు కూడా డబ్బులు సరిపోని ఈ వర్గం వారికే నిజంగా తెలుసు — జీవితం అంటే ఏమిటో, ఆశ అంటే ఏమిటో, కల అంటే ఏమిటో.
ఒక కల కనబడుతుంది, అది నిజం అవుతుందో లేదో తెలియదు. కానీ ప్రతి రోజూ ఆ కల నిజం కావాలని ఆశిస్తూనే ఉంటాం. బాధ్యతల మధ్య మనం కోల్పోయేది ఈ చిన్నీ చిన్నీ ఆశలే. పెద్దపెద్ద కలల మధ్య, ఈ చిన్నచిన్న కోరికలను మరిచిపోతుంటాం.
---
అమృత — ఎప్పుడూ గడియారానికి ముందే పరుగెత్తే అమ్మాయి. ఏదైనా కావాలి అనుకున్నా, దానికోసం ప్రయత్నం చేయడం తక్కువే. “నాకివ్వాలి” అని రాసుంటే ఎంత అడ్డంకులు వచ్చినా వస్తుంది, “నాకివ్వకూడదు” అని రాసుంటే ఎంత ప్రయత్నించినా రాదు అని తన నమ్మకం. అంచనాలు లేకుండా పెరిగిన అమ్మాయి.
ఆ రోజు ఆఫీసులో అమృతకి పని ఎక్కువ. షిఫ్ట్ అయిపోయాక కూడా ఒక గంట అదనంగా పని చేసింది. బయట వర్షం పడుతుందేమో అని కిటికీ నుంచి చూసింది. ఆలస్యం కాకముందే వెళ్ళిపోవాలని లాగౌట్ చేసింది. గడియారం చూడగా తొమ్మిది గంటలు అయ్యింది. బస్‌స్టాప్‌కి వెళ్లడానికి పదిహేనునిమిషాలు పడుతుంది. వర్షం పడకపోతే బాగుండేది అని అనుకుంటుండగానే వర్షం మొదలైంది.
పార్కింగ్‌ఏరియాలోనే ఆగిపోయింది. “వర్షం తగ్గాక వెళ్దాం” అనుకుంది. కానీ తగ్గేలా కనిపించలేదు. తనలోతానే — “అరే, ప్రతి రోజు గొడుగు బ్యాగ్‌లో పెడతావు కదా, ఇవాళ మర్చిపోయావు. ఐనా, ఈ వర్షం కూడా ఇప్పుడే పడాలా?” అని అనుకుంది. వెంటనే — “వర్షంలో తడవడం కూడా బాగుంటుంది” అని నవ్వుకుంది. అడుగు ముందేసింది.
తరువాత ఆగిపోయి — “అయ్యో, తడిస్తే జలుబు వస్తుంది, రేపటికి పెండింగ్ పనులు చేయలేను” అని వెనక్కి తగ్గింది. అప్పుడే ఆకలి వేసింది. “ఈ టైంలో ఈ వర్షంలో పానీపూరి తింటే ఎంత బాగుంటుంది!” అని ఆనందంగా అనుకుంది. కానీ — “నెలాఖరే కదా, ఈ నలభై రూపాయలు ఆటోకైనా పనికొస్తాయి” అని మానేసింది.
అప్పుడే వెనకనుంచి ఎవరో “హలో, మేడం” అని పిలిచారు. అమృత తిరగలేదు. రెండు సార్లు హారన్ కొట్టడంతో చిరాకుగా వెనక్కి తిరిగింది. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి — “వర్షం పడుతుంది, ఒంటరిగా నిల్చున్నారు, లిఫ్ట్ ఇవ్వాల?” అని అడిగాడు.
అమృత — “నేను అడిగానా? నాకు తెలుసు ఒంటరిగా ఉన్నానని. వర్షం తగ్గితే వెళ్ళిపోతా” అని కొంచెం కోపంగా చెప్పింది. అతను నవ్వుతుండగా — “ఎందుకు నవ్వుతున్నారు? నేను జోక్ చేయలేదు” అంది. కిరణ్ — “జోక్ కాదు, కానీ ఈ వర్షంలో ఇలా ఆగీతె రాత్రంతా ఇక్కడే ఉండాలి. కాబట్టి అడిగాను” అన్నాడు.
“ధన్యవాదాలు, నాకు అవసరం లేదు. మీరు వెళ్ళండి” అంది అమృత. “మీరు ఎవరండి? ఆఫీసులో ఎప్పుడూ చూడలేదు” అని ఆశ్చర్యంగా అడిగింది. “ఈరోజే జాయిన్ అయ్యాను. నేను కిరణ్” అని చెప్పి చేతిని ముందుకు చాపాడు. అమృత మాత్రం పట్టలేదు.
“అలాగైతే, వస్తారా?” అని మళ్ళీ అడిగాడు. “నేను తెలియని వ్యక్తితో రాను” అని గట్టిగా అంది అమృత. కిరణ్ — “సరే, మీ ఇష్టం” అని వెళ్లిపోయాడు.
కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చాడు. “ఇంత త్వరగా వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చారు?” అని అడిగింది అమృత. “పెట్రోల్ అయిపోయింది, ఉదయం వేయాలని అనుకుని మర్చిపోయాను” అన్నాడు కిరణ్.. అమృత — “నమ్మొచ్చా?” అని ప్రశ్నించింది. "అంత సీన్ ఏమీ లేదు, ఉదయం పెట్రోల్ వేయాలని అనుకుని మర్చిపోయాను” అన్నాడు కిరణ్.
సమయం తొమ్మిది ఇరవై. వర్షం తగ్గడం లేదు. అమృత తనలోతానే — “ఇలాగే తడుస్తూ బస్‌స్టాప్‌కి వెళ్లిపోతే బాగుంటుంది” అనుకుంది. కిరణ్ వినిపించి — “మీకు కూడా వర్షంలో తడవడం ఇష్టమేనా? రండి, ఇద్దరం నడుస్తూ వెళ్దాం. మీకు తోడుగా ఉంటాను” అన్నాడు.
అమృత ఆలోచించి — “సరే” అంది.
వర్షాన్ని చూస్తుండగా, కిరణ్ —
“ఇష్టమైనది చేయడానికి ఎక్కువగా ఆలోచించకండి. పశ్చాత్తాపం చెందడానికి జీవితమంతా ఉంటుంది, కానీ నచ్చింది చేయడానికి ఆ క్షణం మాత్రమే ఉంటుంది” అన్నాడు. అమృత మెల్లగా నవ్వింది. ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు.
“మీరు మొదటిసారి వర్షంలో తడుస్తున్నారా?” అని అడిగాడు కిరణ్. “మీకు ఎలా తెలుసు?” అంది అమృత. “ఇంత ఎంజాయ్ చేస్తూ తడుస్తున్నారు కాబట్టి” అన్నాడు కిరణ్. అమృత — “నాకిష్టమైనవి చాలానే ఉన్నాయి, కానీ నేను ప్రతిసారీ వాటిని ఆపేస్తాను. నిజానికి నా మనసుకిష్టమైన జీవితాన్ని హోల్డ్‌లో పెట్టి బ్రతుకుతున్నాను” అంది.
“ఎందుకు?” అని ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. “తెలియదు. ఉదాహరణకు ఐస్‌క్రీమ్ తినాలని అనిపించినా, జలుబు వస్తుందని మానేస్తాను. కానీ తినాలనే కోరిక మాత్రం పోదు” అంది అమృత.
కిరణ్ నవ్వుతూ — “ఇంత చిన్న విషయానికి కూడా ఇంత ఆలోచిస్తే ఎలా బ్రతుకుతారు?” అన్నాడు. అమృత — “మీకు సులభంగా అనిపిస్తుంది, కానీ నా పరిస్థితిలో ఉంటే తెలుసు” అంది.
“ఇప్పుడు మీకు నచ్చినది ఏదైనా చేద్దామా?” అన్నాడు కిరణ్. “ఇప్పుడా? సమయం చూశారా, 9:30 అయింది” అంది అమృత. “కేవలం ఒక గంట. మీకోసం మీరు గడపలేరా?” అని అడిగాడు కిరణ్. “ఇంట్లో యెవరైనా ఎదురుచూస్తున్నారా?” అన్నాడు. “నేను ఒంటరిగా ఉంటాను” అంది అమృత. “అయితే ఇంకేం సమస్య? ఈ ఒక గంట మీకోసం గడపండి” అన్నాడు కిరణ్.
అమృత మనసులో — “వద్దు” అనుకున్నా, ఆపుకోలేక — “సరే” అంది. “అయితే, ఆ చిన్నచిన్న ఆశలను తీర్చుకుందాం” అన్నాడు కిరణ్. అమృత — “ఇప్పుడే వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ క్షణం చాలా రోజుల తర్వాత లభించింది” అంది. “పక్కనే పానీపూరి బండి ఉంది, వెళ్దాం” అంది ఆనందంగా.
ఇద్దరూ పానీపూరి తింటూ, అమృత — “మీకు ఎప్పుడు ఏది చెయ్యాలి అనిపిస్తే, అది చేసేయడమ్మేనా? ముందు వెనక ఆలోచించర?” అని అడిగింది.
కిరణ్ — “జీవితం ఎప్పుడు ఏది మన ముందొచ్చి ఇవ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి,” అన్నాడు.
అమృత ఆలోచిస్తుంది.
కిరణ్ — “మరీ అంత పెద్ద మాట అన్నానా?” అన్నాడు.
అమృత — “లేదు, ఈ డైలాగ్ ఏదో మూవీ లో విన్నాను,” అని వెటకారంగా అన్నది.
కిరణ్ — “మీకు అలా అర్థం అయిందా?” అన్నాడు.
అమృత — “నా పెద్ద గోల్ ఏంటంటే, నేను నచ్చినట్టు ఉండటం. ఎవరికీ భయపడకుండా నా అభిప్రాయాలను చెప్పటం” అంది. “చాలా పెద్ద గోల్ కదా!” అని చమత్కరించాడు కిరణ్. “నా స్థితిలో ఉంటే అర్థమవుతుంది” అంది అమృత.
తినేసి బస్‌స్టాప్ వైపు నడిచారు. సమయం ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు. కిరణ్ అమృతని చూస్తూ — "మీరు ఏమి అనుకొను అంటే, ఒక్కటి అడగనా?" అన్నాడు.
అమృత — "వద్దు అంటే మాత్రం వదులుతారా? అడగండి," అంది.
"అప్పటినుంచి స్ట్రేంజర్ అంటున్నారు కదా… ఈ స్ట్రేంజర్ ని నమ్మి ఎలా నడుస్తున్నారు?" అని వెటకారంగా అడిగాడు.
అమృత — "అంత లేదు, బ్యాగ్‌లో సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రే పెట్టుకున్నా. ఆడపిల్ల ని ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాలి కదా ఏదైనా తేడా వస్తే, మీ మోహనికి కొట్టి నాలుగు తగిలించి వెళ్లిపోతా!" అని నవ్వుతూ చెప్పింది.
కిరణ్ — "వమ్మో!" అని నోటిమీద చెయ్యి పెట్టుకున్నాడు.
“ఇవాళ వర్షంలో తొలిసారి డాన్స్ చేస్తూ తడిసాను. ఈ క్షణం కోసం ఇంత కాలం ఆపేసి ఉన్నట్టు అనిపించింది… అంతే, నా మనసు మళ్లీ శ్వాస తీసుకుంది” అని అమృత మనసులో అనుకుంది. ఇప్పటికీ ఇదే చాలు” అని నవ్వుతూ చెప్పింది.
కిరణ్ — “అవును లెండి ఒకేరోజు అన్నీ చేస్తే కిక్ ఏమీ ఉండదు” అన్నాడు. బస్‌స్టాప్‌కి చేరేసరికి వర్షం తగ్గింది. “చాలా రోజుల తర్వాత, నిజానికి చాలా ఏళ్ల తర్వాత, ఈ రోజు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. యూ మేడ్ మై డే” అంది అమృత.
“యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్” అన్నాడు కిరణ్. “నైస్ టు మీట్ యూ” అంటూ చేతి కలిపింది అమృత. “అసలు నేను ఇలా స్ట్రేంజర్‌తో ఎప్పుడూ మాట్లాడలేదు. ధన్యవాదాలు, ఆ క్షణాలను ఆస్వాదించమని గుర్తు చేసినందుకు” అంది.
అమృత కన్నుల్లో ఏదో తడి గమనించిన కిరణ్ — “ఏమైంది?” అని అడిగాడు. “ఏమీ లేదు” అంది అమృత. బస్ వచ్చేసింది. “ఒఫీస్‌లో కలుద్దాం, బై స్ట్రేంజర్” అంది.
కిరణ్ కూడా తన దారిలో వెళ్లిపోయాడు.
---
ఇక్కడ అమృతకి తెలిసింది — బాధ్యతల మధ్య, ఒంటరితనంలో, తన చిన్నచిన్న ఆశలను మర్చిపోయిందని. ఒక అపరిచితుడు వచ్చి గుర్తు చేయకముందు వరకు. ఆ రోజు తాను ఆపేసిన జీవితం, ఒక పరిస్థితిని ఇచ్చింది. ఆ పరిస్థితి ఒక్క అందమైన క్షణం లా మారిపోయింది.
అలోచించండి, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో, మీ హృదయం మాట వినడానికి కొంచెం టైమ్ ఇవ్వండి. ఇది ఇప్పటికే సెల్ఫ్ లవ్ తెలిసిన వాళ్లకోసం కాదు. ఇది సెల్ఫ్ లవ్ కావాలి అని తెలిసినా, ప్రతిరోజూ అలసటతో ఇంటికి చేరుకుని — “ఇదేనా జీవితం?” అని ముక్కుసూటిగా అనుకునే ప్రతి మధ్యతరగతి వ్యక్తికోసం.
ఇన్ని రోజులు పరుగు తీశారు కదా, ఒకరోజు మీ సమయాన్ని మీకోసం హోల్డ్‌లో పెట్టండి. ఆ క్షణాన్ని మీకు నచ్చినట్టు ఆస్వాదించండి.
ఆలోచించండి… మీకు ఇంకా ఎన్ని చిన్నీ చిన్నీ
ఆశలు మిగిలి ఉన్నాయో?