Veda - 6 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 6

Featured Books
  • बेटा

    बेटा बड़ी थकान महसुस हो रही थी। रास्ते में कई बार कई पेड़ के न...

  • मिड-डे मील

    प्राथमिक विद्यालय का प्रांगण कोलाहल से भरा हुआ था। आज स्कूल...

  • पहली नज़र का इश्क - 5

    स्कूल में सब कुछ सामान्य और खुशहाल लग रहा था, लेकिन बिकाश और...

  • राजकुमार का नाम

    आपने परियों की कहानी सुनी होगी, राजा रानी की कहानी सुनी होगी...

  • The Hiding Truth - 1

    अध्याय 1: प्रतिज्ञा और पुराना घरभविष्य की चकाचौंध और अत्याधु...

Categories
Share

వేద - 6

ఎవరో అజ్ఞాత వ్యక్తి నుండి వేదకు వచ్చిన మెసేజ్ చూసి ఆమె స్తంభించిపోయింది. ఎవరో తనను గమనిస్తున్నారనే అనుమానం తనలో మొదలైంది. 

వెంటనే పైకి లేచి అటూ ఇటూ చూస్తూ, కిటికీ దగ్గరకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో అని గమనించింది. కానీ ఎవరూ లేరు. 

ఒకవేళ తన గురించి ఎవరికైనా నిజం తెలిసుంటే అనే ఊహ కూడా ఆమె తట్టుకోలేక పోయింది. రేపు కాలేజీలో ఇంకేం జరగబోతుందో అని భయపడుతూనే చింతలో ఉండిపోయింది.

మరుసటి రోజు ఉదయం, కాలేజ్ గేటు దాటకముందే, అక్కడి వాతావరణాన్ని చూసి వేదకు ఆ రోజు పరిస్థితి అర్థమైపోయింది. 

నిన్నటి వరకు తనను కనీసం పలకరించని జనాలు, అస్సలు తెలియని ముఖాలు.. అందరూ ఇప్పుడు అక్కడ గుమిగూడి ఉన్నారు. 

ముఖానికి గురిపెట్టిన సెల్‌ఫోన్ కెమెరాలు, టీవీ ఛానెళ్ల మైకులు ఆమెను చూసి ఒక్కసారిగా మీద పడ్డాయి.

"వేద! ఆ వీడియోలో ఉన్నది మీరేనా? మీ శరీరం మరియు కళ్ళు అలా ఎలా మారుతున్నాయి?"

"మీరు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? లేదా మీపై ఏదైనా సూపర్ నాచురల్ ప్రయోగాలు ఏవైనా జరుగుతున్నాయా?"

"మీకు ఏవైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అది గ్రాఫిక్స్ కాదని మేం నమ్మొచ్చా?"

ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి, రిపోర్టర్ల ప్రశ్నలు తుపాకీ గుళ్లలా ఆమెను తాకుతున్నాయి. వేద ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. 

వేద కాలేజీకి రాకముందే, ఆ వీడియోలో ఉన్నది వేద అనే పుకార్లు కాలేజీ మొత్తం మారుమ్రోగాయి.

తనను చూస్తున్న ప్రతి కన్ను ఒక అగ్నిగోళంలా, ప్రతి ఫోన్ ఒక ఆయుధంలా కనిపిస్తోంది. 

ఆమె లోపల మళ్ళీ ఆ వేడి మొదలైంది. తన రక్తం మరిగిపోతోంది. కళ్ళలోని ఆ ఎరుపు సెగలు బయటకు వస్తే పరిస్థితి భయంకరంగా మారుతుందని గ్రహించిన వేద, తన కళ్ళను గట్టిగా మూసుకుంది. 

"నేను కూడా వీళ్ళలాగే ఒక మనిషిని కదా.. వీళ్లందరికీ నేను ఒక వింత జంతువులా కనిపిస్తున్నానా?" అని ఆమె మనసు ఆర్తనాదం చేసింది. 

చేతులతో చెవులు మూసుకుని, ఆ గుంపును తోసుకుంటూ అక్కడి నుండి వెనక్కి పరుగు తీసింది.

మరోవైపు, అనన్య స్టూడియోలో వాతావరణం నిప్పులు చెరుగుతోంది. 

టీవీలో వేద పడుతున్న ఇబ్బందులను, మీడియా వేటను చూస్తుంటే అనన్య మనసులో ఏదో మూల విచారం మొదలైంది. తను ఆశించిన సక్సెస్ వచ్చింది కానీ, దాని వెనుక ఒక అమ్మాయి భవిష్యత్తు దాగుందని తను ఊహించలేదు.

"ఆ అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేశావు కదా అనన్యా! ఇదా.. ఇదేనా నీకు కావాల్సిన సక్సెస్?" అని విక్కీ కోపంతో ఊగిపోతున్నాడు.

అనన్య మౌనంగా టీవీ వైపు చూస్తోంది. ఆమె వేళ్ళు వణుకుతున్నాయి. "నేను అసలు ఏం చేశాను? సహాయం చేయబోయి ఆమెను ప్రమాదంలోకి నెట్టానా? నా అత్యాశ ఆమె శాంతిని బలి తీసుకుందా?" అని తనలో తానే ప్రశ్నించుకుంది. 

కానీ, ఒకవేళ అనన్య మనసు మార్చుకొని, ఇప్పుడు ఆ వీడియోను డిలీట్ చేసినా లాభం లేదు. అది అప్పటికే కోట్ల మంది ఫోన్లలోకి చేరిపోయింది.

కాలేజీ నుండి పరుగులు తీసిన, వేద ఆయాసపడుతూ మరలా తన చీకటి గదిలోకి చేరుకుంది. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని ఆమెకు అర్థమైపోయింది. గజగజ వణుకుతున్న చేతులతో తన సామాన్లను వేగంగా సర్దుకోవడం మొదలుపెట్టింది.

అల్మారాలో దాచుకున్న తన తల్లిదండ్రుల పాత ఫోటో, దాని వెనుకే ఉన్న శరభ ముద్ర కలిగిన కొన్ని పాత పుస్తకాలను జాగ్రత్తగా తీసుకుంది.

చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ' నీకు ఎప్పుడైనా జీవితంలో ఎదురించలేని సమస్య వచ్చినపుడు, మీ అస్తిత్వం ప్రమాదంలో పడినపుడు, వెంటనే నువ్వు అడవిలో ఉండే గురుస్వామి దగ్గరకు వెళ్ళు. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలరు.'.

"ఇకపై ఇక్కడ ఉండడం నాకు సురక్షితం కాదు.. ఇది నేను ఉండాల్సిన స్థలం కాదు. ఈ నగరం నన్ను ఒక మృగంలా చూస్తోంది. నా ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, నా ప్రాణాలు దక్కాలన్నా నేను ఇక్కడి నుండి వెళ్ళాలి.." అని నిర్ణయించుకుంది.

వేద ఇంటినుండి బయలుదేరగానే, బయట భారీ వర్షం మొదలైంది. ఆకాశం నుండి పడుతున్న ప్రతి నీటి చుక్క వేదలోని వేడిని చల్లార్చలేకపోతోంది. 

నగరం వెలుపల ఉన్న హైవే వైపు ఆమె గబగబా నడుస్తుండగా, ఒక నల్లటి కారు నెమ్మదిగా ఆమెను అనుసరిస్తోంది.

ఆ కారు స్టీరింగ్ పట్టుకున్న వ్యక్తి చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. అతని పక్క సీటులో ఒక పాత ఫైల్ ఉంది. దాని మీద వేద చిన్నప్పటి ఫోటోతో పాటు పెద్ద అక్షరాలతో 'Bloodline: Dwara-Palika' అని రాసి ఉంది. అతను అర్జున్. 

అతని ముఖం చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు కానీ, అతని కళ్ళలో మాత్రం ఏదో రహస్యం దాగి ఉన్నట్టు ఉంది.

"వేటాడేవాడు వచ్చేలోపు.. నేను నిన్ను చేరాలి వేద. నీకు తెలియని నీ శక్తే నీకు శత్రువు కాబోతోంది." అని తనలో తానే అనుకుంటూ కారును ఆమెకు సమీపంగా పోనిచ్చాడు.

నగర శివార్లలోని పాత వంతెన మీద వేద ఒక్క క్షణం ఆగింది. వెనుక వెలుగులతో నిండిన నగరం.. ముందు కటిక చీకటితో ఉన్న అడవి దారి. 

గాలిలో ఏదో గర్జన వినబడినట్టు ఆమెకు అనిపించింది. ఆమె లోపల ఉన్న ఆ శక్తి ఇప్పుడు శాంతంగా లేదు, అది ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తుపానులా కదులుతోంది.

"నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.. మళ్ళీ తిరిగి రాకపోవచ్చు, కానీ ఒకవేళ వస్తే, నాలోని ఈ మంటను ఆర్పే మార్గం తెలిసాకే వస్తాను." అని మొండిగా అడుగు ముందుకేసింది.

అదే సమయంలో, వర్షంలో తడుస్తూ వేద బస్సు ఎక్కుతుండగా, కొంత దూరంలో పొదల్లో నక్కిన ఒక వ్యక్తి ఆమెను రహస్యంగా ఫోటో తీశాడు. 

అతను తన ఫోన్లో ఎవరికో రహస్యంగా ఒక మెసేజ్ టైప్ చేశాడు: "పక్షి గూడు వదిలింది.. వేట మొదలు పెట్టండి."

ఆ మెసేజ్ వెళ్ళింది మరెవరికో కాదు.. శతాబ్దాలుగా వేద వంశం కోసం వేచి చూస్తున్న 'రుద్ర భైరవ' మనుషులకు! 

అర్జున్ కారు వేగంగా వేద ఉన్న బస్సును వెంబడిస్తుండగా, అడవి మార్గంలో ఆమె కోసం ప్రాణాంతకమైన ఉచ్చులు సిద్ధమవుతున్నాయి.

వేద వెళ్తున్నది విముక్తి కోసమా? లేక తన అంతం కోసమా?
మరిన్ని మలుపులతో వచ్చే ఎపిసోడ్ లో…