అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్:2.75/5
మూవీ: అనగనగా ఒక రాజు
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, రేవంత్ (బుల్లిరాజు) తదితరులు దర్శకత్వం: మారి క్రియేటివ్ డైరెక్టర్: చిన్మయి నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫి: జే యువరాజ్ ఎడిటర్: కల్యాణ్ శంకర్ బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ రిలీజ్ డేట్: 2026-01-14
గోదావరి జిల్లాలోని గౌరవపురం గ్రామానికి జమీందారీ కుటుంబానికి యువకుడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఒకప్పుడు సంపన్న కుటుంబమైనప్పటికీ.. తాత చేసిన దుబారా పనుల వల్ల జమీందారీ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. అప్పులు, ఆర్థిక సమస్యలు రాజును వెంటాడుతుంటాయి. బాగా ఆస్థిపాస్తులు ఉండి.. ఎవరైనా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫైనాన్సియల్‌గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకొంటాడు. ఆ వెతుకులాటలో పక్క గ్రామానికి చెందిన ఆస్థిపరుడు (రావు రమేష్) కూతురు చారులతను చూసి ఆమె తనకు సరైనదని డిసైడ్ అవుతాడు. ఆమెను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోనేందుకు ఆపరేషన్ చారులత అనే కార్యక్రమాన్ని చేపడుతాడు.
జమీందారీ కుటుంబానికి చెందిన రాజును వెంటాడిన ఆర్థిక సమస్యలు ఏమిటి? రాజు తాత చేసిన దుబారా పనులు ఏమిటి? గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తన ఆంటీ (ఝాన్సీ)తో ఎలాంటి ఛాలెంజ్ చేస్తాడు? ఆపరేషన్ చారులతను రాజు ఎలా ముందుకు నడిపించాడు? చారులత మనసును రాజు ఎలా గెలుచుకొన్నాడు? చారులతను మెప్పించడానికి రాజు చేసిన గిమ్మిక్స్ ఏమిటి? చారులతతో పెళ్లి తర్వాత రాజుకు తగిలిన భారీ షాక్ ఏమిటి? ఆ షాక్ నుంచి ఎలా తేరుకొన్నాడు? ఊరి రాజకీయాల్లోకి రాజు ఎందుకు తలదూర్చి సర్పంచ్ పదవికి పోటీపడ్డాడు? రూరల్ పాలిటిక్స్ రాజు జీవితాన్ని ఎలాంటి మలుపుతిప్పాయి? అనే ప్రశ్నలకు సమాధానమే అనగనగా ఒక రాజు సినిమా కథ.
అనగనగా ఒక రాజు సినిమా కథ విషయానికి వస్తే.. ఆడియెన్స్‌ను గొప్పగా భావోద్వేగాలకు గురిచేసే కథ కాదు. కేవలం వినోదం, డైలాగ్ కామెడీపై ఆధారపడి నవీన్ పొలిశెట్టి ఇమేజ్‌కు తగినట్టుగా చేసిన రెగ్యులర్ రూరల్, లవ్ స్టోరీ. అయితే ఇలాంటి సింపుల్ పాయింట్‌తో కథ మొదలుపెట్టిన దర్శకుడు మారి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి.. రాజు క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి సుమారుగా 30 నిమిషాలు తీసుకొన్నారు. అయితే అంత సమయం తీసుకొన్నప్పటికీ.. సరైన సీన్లు, డైలాగ్స్ రాసుకోకపోవడంతో ఈ సినిమాను ఎటువైపు తీసుకెళ్తున్నారనే సందిగ్దత కలుగుతుంది. కానీ చారులత క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా కథ సరైన ట్రాక్‌పైకి ఎక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుంచి ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సరదాగా సాగిపోతుంది. ఆ తర్వాత చకచకా అసలు కథలోకి వెళ్లి సెకండాఫ్‌కు మంచి లీడ్ ఇస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్‌తో రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక సెకండాఫ్‌లో ఊహించని మలుపులు కథలో లేకపోవడం వల్ల సగభాగం కామెడీతో ఫన్నీగా నడిపించే ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే ఊరమాస్ డైలాగ్స్, రొటీన్ స్టఫ్‌తో సినిమా ముందుకెళ్తుంది. అయితే అలా సరదాగా సాగిపోతున్న తరుణంలో రూరల్ పాలిటిక్స్‌తో స్టోరి సడెన్ టర్న్ తీసుకోవడమే కాకుండా మరింత వినోదాన్ని కథలో జొప్పించడానికి అవకాశం ఏర్పడింది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా సందడి సందడిగా మారిపోతుంది. క్లైమాక్స్‌లో ఓ ఎమోషనల్ పాయింట్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ తప్పా మరో క్యారెక్టర్‌కు ప్రాధాన్యం కనిపించదు. నవీన్ భుజాలపైనే ఈ సినిమా భారాన్ని పెట్టి మోయించారు.
నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమా కథంతా రాజు పాత్ర చుట్టే తిరగడం వల్ల నవీన్ పొలిశెట్టి తప్ప మరో క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ కూడా లేకపోయింది. ఈ సినిమా నవీన్ వన్ మ్యాన్ షో మాదిరిగా సాగుతుంది. మీనాక్షి చౌదరీ చారులత పాత్రలో ఒదిగిపోయింది. అమాయకమైన అమ్మాయిగా, సెకండాఫ్‌లో కొంత బలమైన క్యారెక్టరైజేషన్ కొన్ని సీన్లలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. రావు రమేష్ అతిథి పాత్రకే పరిమితమయ్యారు. బుల్లిరాజు రేవంత్ కొన్ని సీన్లలో నవీన్ పొలిశెట్టితో పోటీపడి నటించాడు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించే రోల్స్‌లో కనిపించారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫుల్ స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. పరిమితమైన లొకేషన్లలో షూట్ చేయడం, రూరల్, ఎలక్షన్ బ్యాక్ డ్రాప్‌తో సాగడం వల్ల క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కే ప్రాధాన్యం ఉండటం వల్ల సినిమాటోగ్రఫి డిపార్ట్‌మెంట్ పనితీరు గొప్పగా లేకపోయింది. ఫస్టాఫ్‌లో ఆరంభంలో 10 నిమిషాలు ట్రిమ్ చేస్తే సినిమా స్టార్ట్ ఫీల్ గుడ్ ఉండేదనిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ డైలాగ్ డ్రామా. అయితే కొన్ని ఏరియాల్లోనే డైలాగ్స్, ఫన్ సీన్లు వర్కవుట్ అయ్యాయి. ఫ్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఓవరాల్‌గా అనగనగా ఒక రాజు సినిమా గురించి చెప్పాలంటే.. బుర్రకు ఏ మాత్రం పనిలేకుండా సరదాగా రెండున్నర గంటలపాటు నవ్వుకొనే విధంగా ఉండే కామెడీ ఎంటర్‌టైనర్. జాతి రత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టికి ఏర్పడిన ఇమేజ్‌ను టార్గెట్ చేసి రాసుకొన్న ఫన్ రైడ్ మూవీ. భారీగా అంచనాలు పెట్టుకొని వెళ్లాల్సిన సినిమా కాదు. సంక్రాంతి పండుగ మూడ్‌తో ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. ఫుల్ టైమ్ పాస్ అండ్ పైసా వసూలు మూవీ. కాబట్టి సరదాగా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.