మరుసటి రోజు ఉదయం.. ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంది. అయాన్ ఇంటి పనులన్నింటినీ ఎంతో చకచక చేసేస్తున్నాడు. వంటగదిలో సుస్మిత టిఫిన్ చేయడంలో నిమగ్నమై ఉండగా, రాజు గారు అక్కడికి వచ్చారు.
"ఏమిటి సుస్మిత.. ఇవాళ ఏం టిఫిన్? ఈ దోశలు ఎప్పుడూ నీ ముద్దుల కొడుకు కోసమేనా లేక మా కోసం కూడా ఏమైనా మిగిల్చావా?" అని రాజు గారు సరదాగా అడిగారు. సుస్మిత నవ్వుతూ, కంటి సైగతో పక్కనే ఉన్న హాట్ బాక్స్‌ని చూపించింది.
అందులో వేడివేడి పూరీలు పక్కనే పూరి కూర్మ చూసి రాజు గారు మురిసిపోతూ, "థాంక్యూ మై బెటర్ హాఫ్!" అంటూ ఆమె బుగ్గ గిల్లుతుండగా.. సరిగ్గా అదే సమయానికి నీల అక్కడికి వచ్చింది. అమ్మానాన్నల అన్యోన్యతను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెనుతిరిగింది.
బయటకు రాగానే అయాన్ ఎదురై, "గుడ్ మార్నింగ్ నీల!" అన్నాడు. ఆ పిలుపు వినగానే నీల గుండెలో ఏదో తెలియని అలజడి. రాత్రి కలలో చూసిన దృశ్యాలన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అలా నిశ్శబ్దంగా అయాన్ వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపుల్లోని అర్థం ఏమిటో ఆ యంత్రానికి అంతుచిక్కడం లేదు.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజు గారు, "నీలా..!" అని పిలిచారు. పరాధ్యానంలో ఉన్న నీల ఒక్కసారిగా ఉలిక్కిపడి, "ఆ.. ఆ.. చెప్పండి నాన్న!" అంది.
"ఏమైంది తల్లి? ఎక్కడికో వెళ్ళిపోయావు.. అంత పరాధ్యానం దేని గురించి?" అని అడిగారు రాజు గారు.
"ఏమీ లేదు నాన్న.." అంటూ నీల తలదించుకుని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది.
నీల అక్కడి నుండి నేరుగా తన అన్నయ్య గదిలోకి వెళ్ళింది. ఆర్య ఇంకా గాఢనిద్రలో ఉన్నాడు. "ఒరేయ్ అన్నయ్య.. లేవరా! ఎప్పుడూ లేస్తావు?" అంటూ పక్కనే ఉన్న దిండు తీసుకుని వాడిని కొడుతూ లేపడం మొదలుపెట్టింది. కానీ ఆర్య మాత్రం అస్సలు కదలలేదు.
అప్పుడే అక్కడికి వచ్చిన సుస్మిత, కొడుకు తల నిమురుతూ.. "ఎందుకే వాడిని అలా లేపుతావు? కాసేపు పడుకోనీ నా బంగారాన్ని!" అంది గారంగా. అది చూసి రాజు గారు నవ్వుతూ, "ఇలాగే గారం చెయ్.. వాడు దేనికీ పనికిరాకుండా పోతాడు" అన్నారు.
"కరెక్టుగా చెప్పారు నాన్న!" అని నీల వంత పాడింది. "సరేలేవే.. నీ మాటలు చాలు కానీ! వాడు రాత్రి ఎంతసేపు చదువుకుని పడుకున్నాడో ఏమో.. అందుకే లేవలేదు" అంటూ సుస్మిత తన కొడుకును వెనకేసుకొచ్చింది.
"సరేలే కానీ.. ఆర్య లే ఇక!" అని రాజు గారు కొంచెం గంభీరంగా అనేసరికి, ఆర్య వెంటనే మంచం మీద కూర్చుని, "గుడ్ మార్నింగ్ నాన్న!" అన్నాడు. అది చూసి నీల పకపకా నవ్వింది. నిజానికి ఆర్యను లేపడానికి రాజు గారు గాని సుస్మిత గాని ఎవరు లేరు, నీల తన గొంతు మార్చి వాలా నాన్నలా పిలిచిందని అప్పుడు అర్థమైంది ఆర్యకి.
ఇదంతా అయాన్ దూరంగా నిలబడి చాలా నిశితంగా గమనిస్తున్నాడు. మనుషుల మధ్య ఉండే ఈ ఆటపట్టించడం, ప్రేమ అతనికి కొత్తగా అనిపిస్తున్నాయి.
తను మోసపోయానని తెలిసిన ఆర్య, "ఆగు చెల్లీ.. నిన్ను చెపుతాను!" అంటూ కోపంగా ఆమెను కొట్టడానికి వచ్చాడు. నీల గబగబా పరుగు తీస్తూ వెళ్ళి తండ్రి వెనుక దాక్కుంది. "నువ్వు దొరకవే.. చెప్తా నీ పని! అమ్మ.. దాన్ని పట్టుకో ముందు!" అంటూ ఆర్య ఆమెను పట్టుకోవడానికి ఇల్లంతా పరుగు తీస్తున్నాడు.
నీల గబగబా పరుగెత్తుకుంటూ వెళ్ళి అయాన్ వెనుక దాక్కుంది. "నువ్వు నన్ను పట్టుకోలేవు అన్నయ్య!" అంటూ అతడి వెనుక నుండి వెక్కిరిస్తూ హాలు మొత్తం అటూ ఇటూ పరిగెత్తింది. అయాన్ ఆమెకు రక్షణగా ఒక గోడలా నిలబడి, అటు ఇటు జరుగుతున్నాడు.
చివరికి నీల పరుగు ఆపి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఆర్య కూడా ఒక్కసారిగా తన పరుగు ఆపేసి ఏమీ తెలియనట్టు నిలబడ్డాడు. రాజు గారు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమైంది ఆర్య.. ఎందుకు అలా ఆగిపోయావు?" అని అడిగారు.
"ఏమీ లేదు నాన్న.. ఊరికే!" అంటూ ఆర్య నీల వైపు కోపంగా చూశాడు. "నీ పని తర్వాత చెపుతాను.. అప్పుడు దొరుకు తావు కదా, చూడు!" అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయాన్ మాత్రం ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సరదా పోరును తన ప్రోగ్రామింగ్ కెమెరాల్లో భద్రపరుచుకుంటున్నాడు.
ఆర్య ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చాడు. తన చెల్లెలు తనని అందరి ముందు ఎలా ఏడిపించిందో తలచుకుంటూ, ఎలాగైనా దానికి ఒక గట్టి 'పనిష్మెంట్' ఇవ్వాలని పథకం వేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతనికి అయాన్ కనిపించాడు.
వెంటనే అయాన్ దగ్గరికి వెళ్లి, "అయాన్.. ఇలా రా ఒకసారి!" అని తన గదిలోకి తీసుకెళ్లాడు. వంటగదిలో ఉన్న సుస్మిత అది చూసి, "అరేయ్ ఆర్య.. టిఫిన్ చల్లారిపోతోంది! వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అని అడిగింది. "ఏమీ లేదు అమ్మ.. ఇప్పుడే వస్తాను" అని చెప్పి గది తలుపులేసుకున్నాడు
అయాన్.. నాకు ఒక చిన్న సహాయం చేస్తావా?" అని అడిగాడు ఆర్య.