Wounded Friendship - 2 in Telugu Detective stories by Naik books and stories PDF | గాయమైన స్నేహం - 2

The Author
Featured Books
Categories
Share

గాయమైన స్నేహం - 2

అదృశ్యమైన మగవాళ్లు – సామ్రాట్‌ కథ

సామ్రాట్‌ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో సంతోషంగా జీవించేవాడు. అతని జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుండేది. గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా చూసేవారు. అతనికి సహాయం చేయడం, సమస్యలు పరిష్కరించడం అంటే ఎంతో ఇష్టం.అతని నైతిక విలువలు, ధైర్యం, నిబద్ధత గ్రామ ప్రజలందరికీ ఆదర్శంగా ఉండేవి.

ఒక శనివారం ఉదయం, సామ్రాట్‌ తన ప్రేమికురాలైన మధుతో కలిసి గ్రామం దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మధుతో నవ్వుతూ, ముచ్చటిస్తూ ఉన్న సమయంలో, అతని ఫోన్‌ మోగింది.

ఫోన్‌ ఎత్తగానే, అతని పై అధికారిగా ఉన్న DSP రామలింగం ఆవేశంగా మాట్లాడాడు – "సామ్రాట్‌, ఇది అత్యవసర విషయం. గత రెండు రోజులుగా గ్రామం పరిసర ప్రాంతాల్లో మగవాళ్లు కనిపించకుండా పోతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మగవారు మిస్సింగ్‌ అయ్యారు. ఇది చిన్న విషయం కాదు. నీవు వెంటనే విచారణ ప్రారంభించాలి."

ఓకే సార్! అని ఫోన్ కట్ చేసి మధుతో ఇలా అంటాడు!  మధు  ఇది అత్యంత అవసరమైన సందేహం మనం ఇక్కడి నుండి త్వరగా బయలుదేరుద్ధం అని అంటాడు సామ్రాట్. అయితే మధు ఏమైంది సామ్రాట్ అసలు విషయం ఏంటి అడుగుతుంటే, తరువాత చెప్తా దా ముందు మనం పోదాం అని బయలుదేరుతారు.

వెంటనే మధుతో కలిసి తిరిగి గ్రామానికి వచ్చాడు. అతను మొదట మిస్సింగ్‌ అయిన మగవారి కుటుంబాలను కలుసుకుని వివరాలు సేకరించాడు. అందరూ ఒకే విధంగా చెప్పారు – "రాత్రి సమయంలో బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు."

సామ్రాట్‌ తన దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి గ్రామం చుట్టూ ఉన్న అడవులు, పాత గుహలు, నిర్జన ప్రాంతాలు అన్నీ తడిసి ముద్దయ్యేలా వెతికాడు. ప్రతి మూలను పరిశీలించాడు. కానీ ఎక్కడా మగవాళ్ల ఆచూకీ కనిపించలేదు.

రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రజలు సామ్రాట్‌ను ఆశగా చూస్తున్నారు. పై అధికారుల నుండి కూడా ఒత్తిడి పెరుగుతోంది. "ఇంకా ఎలాంటి పురోగతి లేదు? ఇది మీడియా దృష్టిలోకి వస్తోంది సామ్రాట్‌!" అని DSP రామలింగం హెచ్చరిస్తున్నాడు.

సామ్రాట్‌కి అసలు ఏం జరుగుతోంది అనే విషయం అర్థం కావడం లేదు. అతని మనసు గందరగోళంగా ఉంది. "ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు... దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది" అని అతని అంతఃకరణం చెబుతోంది.

ఒక చలికాల రాత్రి. సామ్రాట్‌ తన గదిలో ఒంటరిగా కూర్చుని, గత కొన్ని రోజులుగా మిస్సింగ్‌ అయిన మగవాళ్ల కేసులపై నోట్స్‌ తిరగేస్తున్నాడు. ప్రతి ఒక్కరి వివరాలు, వారి కుటుంబ నేపథ్యం, అలవాట్లు, జీవనశైలిని పరిశీలిస్తూ వున్నాడు.

అతనికి ఒక ఆసక్తికరమైన విషయమొకటి గమనించబడింది. మిస్సింగ్‌ అయిన మగవాళ్లందరిలో ఒక కామన్‌ లక్షణం ఉంది—వారు కొద్దిగా ఆడవారి లక్షణాలు కలిగి ఉన్నవారు. అంటే, వారు ఇంట్లో ఎక్కువగా గడిపేవారు, వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, పిల్లల సంరక్షణ వంటి పనుల్లో ఆసక్తి చూపేవారు. కొందరు సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉండేవారు, కళలపై మక్కువ కలిగినవారు.

ఈ విషయం సామ్రాట్‌కి ఆలోచనలో పడేసింది. "ఇది యాదృచ్ఛికం కాదు... ఎవరో లక్ష్యంగా ఎంచుకుని, ఈ లక్షణాలున్న వారిని మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారు" అని అతనికి అనిపించింది.

అతను మరింత లోతుగా విచారించసాగాడు. గ్రామంలో ఉన్న మిగతా మగవాళ్లను గమనించాడు. వారిలో ఎవరు ఇంట్లో ఎక్కువగా ఉంటున్నారో, సున్నితమైన స్వభావం కలిగి ఉన్నారో, వారిని రహస్యంగా గమనించసాగాడు.

ఒకరోజు, అతనికి ఒక యువకుడు తరుణ్ గురించి సమాచారం వచ్చింది. అతను కూడా అదే లక్షణాలతో ఉన్నవాడు. సామ్రాట్‌ అతన్ని రహస్యంగా గమనించసాగాడు.

తరుణ్ ఒక రాత్రి ఇంటి బయటకు వెళ్లినప్పుడు, ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అతన్ని వెంబడించడాన్ని సామ్రాట్‌ గమనించాడు.

రహస్య ఛాయలు

వెంటనే సామ్రాట్‌ తన నోట్స్‌ పట్టుకుని, అనుమానాస్పద వ్యక్తులను వెంబడించేందుకు బయలుదేరాడు. అతని మనసు ఉరుకులు పరుగులు పెట్టుతోంది. "ఈసారి తప్పకుండా పట్టుకోవాలి!" అని తనలో తానే నిశ్చయించుకున్నాడు.

అయితే, ఆ వ్యక్తులు చాలా తెలివిగా వ్యవహరించారు. సామ్రాట్‌ వెంబడిస్తున్న విషయం తెలుసుకున్న వారు ఒక మలుపు వద్ద దారి మళ్లించి, చీకటి అడవిలోకి పారిపోయారు. సామ్రాట్‌కి వారు కనిపించకుండా పోయారు.
"ఓహ్ షట్!" అని నిరాశతో నిట్టూర్చాడు.

సామ్రాట్‌కి ఇది ఇంకా గందరగోళంగా అనిపించింది. "వారు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇలా చేస్తున్నారు?" అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతున్నాయి.

రహస్య కాల్ – సామ్రాట్‌

చీకటి రాత్రి. సామ్రాట్‌ తన గదిలో కూర్చుని, గత కొన్ని రోజులుగా జరిగిన మిస్సింగ్‌ కేసులపై ఆలోచనలో మునిగిపోయాడు. ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి లక్షణం, ప్రతి క్లూ, "వారు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు?" అనే ప్రశ్నలు అతని మనసును కలవరపెడుతున్నాయి.

అంతలో, అతని ఫోన్‌ మోగింది. స్క్రీన్‌ మీద కనిపించిన నంబర్‌ పూర్తిగా తెలియని నంబర్‌. "ఎవరబ్బా ఇది? కొత్త నంబర్‌లా ఉంది…" అని అనుమానంతో ఫోన్‌ ఎత్తాడు.

"సామ్రాట్‌... నీ దర్యాప్తు చాలా దగ్గరకి వచ్చింది. కానీ జాగ్రత్త. ప్రతి అడుగు నీకు ప్రమాదం కావచ్చు," అని ఒక గంభీరమైన, కానీ గుర్తు తెలియని స్వరం.

సామ్రాట్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. "ఎవరు మీరు? మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు?" అని ప్రశ్నించాడు.

"ఇది తెలుసుకోవాలంటే, నువ్వు ఇంకా లోతుగా వెతకాలి. నీకు ఇవి అనవసరమైనవి. నువ్వు తప్పుకో. ఇది నీ స్థాయి విషయం కాదు," అని గంభీరమైన స్వరం.

సామ్రాట్‌ కోపంతో, ధైర్యంగా స్పందించాడు — "నువ్వు ఎవరైనా కానీ, నీ గురించి, నీ బాగోతం, నీ కుట్రను బయట పెడతాను. ఇది నా బాధ్యత. ప్రజల కోసం నేను వెనక్కి తగ్గను."

అప్పుడు ఆ స్వరం హాస్యంగా నవ్వుతూ, "హా హా హా... సామ్రాట్, అది నీ వాళ్ళ అయ్యే పని కాదు. ఇది అంత సులభం కాదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నీ బలాలు, నీ బలహీనతలు... అన్నీ నా చేతిలో ఉన్నాయి," అని చెప్పి, కాల్‌ కట్‌ చేశాడు.

సామ్రాట్‌ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. "నా గురించి తెలుసా? అంటే... ఎవరో దగ్గరవారు? నా చుట్టూ ఉన్నవారిలో ఎవరో?" అనే అనుమానాలు అతని మనసును కలవరపెట్టాయి.

అవును! అసలు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎవరు? మగవారు ఎందుకు మిస్ అయ్యారు? ఈ మిస్టరీ వెనక ఉన్న నిజం ఏమిటి? 

ఇంతవరకు కథను ఆసక్తిగా అనుసరించినందుకు ధన్యవాదాలు.తదుపరి భాగం వరకు... సెలవు!

🌙 మీ సామ్రాట్‌ మళ్లీ వస్తాడు... నిజాన్ని వెలికితీయడానికి!

మీ ఆశీస్సులతో

నేను... ✍️ Naik 💞