ఈ నవల ఎవరినీ ఉద్దేశించినది కాదు.
దీనిలో ప్రస్తావించిన విషయాలన్నీ కేవలం కల్పితాలు
పురాణాల నుండి కొన్ని విషయాలను వికీపీడియా నుండి సేకరించడం జరిగినప్పటికీ దానికి నేను జోడించిన కథ, ప్రక్రియలు అన్ని పూర్తిగా నా కల్పితం.
Prologue:
ద్వాపర యుగాంతానికి సమయం దగ్గర పడుతున్నది.
దుర్వాస మహాముని శాపం ఫలితం శ్రీకృష్ణ జాంబవతి సంజనిత సాంబుని గర్భం నుండి పుట్టిన ముసలం యాదవ కులాన్ని మొత్తం అంతమొందించడం మొదలుపెట్టింది.
యాదవులంతా ఆ రోకలిని ముక్కలు ముక్కలు గా చేసి సముద్రమున పారవేసినప్పటికీ దాని ద్వారా పుట్టిన చెట్ల ద్వారా బాణాలుగా మారి అదే ముసలం ముని శాపాన్ని అనుసరిస్తూ యాదవుల కులాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నది..
సరిగ్గా అదే సమయం లో భద్ర , బంధిర,బిల్వ ,లోహ ,మహావనాలు గా విలసిల్లుతున్న వ్రజభూమిని పరిపాలిస్తున్న బలరాముని సభ లో జరుగుతున్నది ఆ సమావేశం..
" స్వామీ...!! ఎంతటి పుణ్యం చేసిననూ ఈ ముని శాపం నుండి తప్పుకు బతుకగల మార్గము తోచుట లేదు.
ఇదే గనుక కొనసాగితే మన యాదవులు అతా అంతమై పోవుటకు పెద్ద సమయము పట్టేట్టుగా అగుపడుటలేదు."
మహామంత్రి తక్షకుని కంఠం ఆందోళన గా పలికినది.
బలరాముడు తన హలాయుధమును
పైకెత్తుతూ సాలోచన గా చూశాడు తన మంత్రి వంక.
" శ్రీకృష్ణుల వారు కూడా ఈ విషయం మేర ఏ ప్రయత్నం చేయుట లేదు.
ముని శాపం తప్పించుట ఎవరి తరం కాదు అని ఇప్పుడిప్పుడే మన లోకపు వాసులందరికీ అర్థమవుచున్నది.
కానీ మానవ రూపమున వచ్చి మమ్మల్ని అందరినీ అలరించిన ఆదిశేష సహిత శ్రీ విష్ణు రూపమును ఆరాధించు కోరిక మా ఎవ్వరికి ఇంకా తీరలేదు.
శ్రీకృష్ణ బలరామరూపాలలో మిమ్మల్ని ప్రతిరోజూ ధ్యానించి పూజించి ఎల్లకాలము అలాగే ఉండిపోవాలన్నా విచిత్ర కోరిక మాలో కలుగుచున్నది. "
తన కోరికను సవినయముగా వెల్లడించాడు తక్షకుడు.
" కానీ ఎల్లకాలము అన్నది ఇచ్చట పరిగణన లోకి రాదని తమరికి తెలిసినట్లుగా ఎవరికి తెలుసును మహామంత్రి...??
ఈ భూమిపై పుట్టిన మానవ శరీరము పడిపోకమానదు.
మరణము అనివార్యము.
ఆ విషయము సంపూర్ణముగా ఎరిగిన పెద్దలైన తమరు ఈ విధమైన కోరిక కోరుట బహు విచిత్రముగానున్నది.."
నల్లని రాళ్ళను వ్రాసుకుంటూ గలగల పారే యమునను గుర్తు తెచ్చుకున్న కంఠముతో మార్గముగా పలికినాడు ఎర్రని పీతాంబరమును ధరించిన బలరాముడు.
వినయముగా చేతులు జోడించి చిరునవ్వు నవ్వాడు మహామంత్రి.
" మరణము తప్పించుకొనుట సాధ్యము కాదు స్వామి..!!!
కానీ ఈ విధముగా ఒక్కని అకార్యము వలన మిగిలిన అందరమూ తమరిని ధ్యానించవలేనన్న కోరిక తీరకుండానే మరణించుట భావ్యము కాదనిపించుచున్నది నాకు.!
మేము మరణం పాలైనననూ మా తర్వాతి తరములైననూ మిమ్మల్ని ధ్యానించి మన జాతి ఔన్నత్యమును ముందుకు తీసుకు వెళ్తాయి అంటే ఆ అవకాశము కూడా లేకుండా పోయినది."
వాపోయాడు.
ఆలోచనలో పడిపోయాడు వ్రజభూమి పాలకుడైన ఆ బలరాముడు.
అతనిలో ఆలోచన తీవ్రతరం అవుతున్నట్లుగా అతని చుట్టూ అలాగే విస్తరించి ఉన్న తెల్లని వెలుగు మరింతగా పసిడి రంగులు విరజిమ్ముతూ విస్తృతమైనది.
మహామంత్రితోపాటు సభా సదులైన వారెవరు బలరాముని మరలా మాట్లాడించే ప్రయత్నం చేయలేదు.
ఆర్తుల పాలిట కల్పవృక్షం బలరాముడు.
తాము కోరిన కోరికను ఖచ్చితంగా తీర్చుటకు సాయశక్తుల ప్రయత్నిస్తాడని వారికి తెలుసు.
అందులకే అతని ఆలోచన స్రవంతిని ఏమాత్రం కదిలించకుండా మౌనం వహించారు అందరూ.
దాదాపు ఒక ఘడియ కాలము తరువాత మూసిన నీలోత్పలముల వంటి కన్నులను పరిచి కరుణ సారించుచున్న దృక్కులతో తన వారిని చూశాడు ఆ బలభద్రుడు.
" తక్షకా...!!"
పిలిచాడు తన మహామంత్రిని.
వినయముగా చేతులు జోడించి తన ప్రభువు దగ్గరకు నడిచి వెళ్ళాడు తక్షకుడు.
అతని చెవిలో ఏదో చెప్పిన బలరాముడు సభ పూర్తయినట్లుగా లేచి సంవర్తకం అనే పేరు గల తన హలాన్ని భుజాన వేసుకొని ఠీవి గానడిచి వెళ్లిపోయాడు సభా మందిరం నుండి..
నడిచి వెళుతున్న శేషుని అవతారమైన ఆ బల రాముడిని చూస్తుండి పోయారు సభా సదులు.
ఆ తరువాత తక్షకుని నోటివెంట వచ్చిన పలుకులు వారిని ఇహలోకములోనికి తీసుకొచ్చాయి.
అది మాత్రమే కాక అమితమైన ఆనందాశ్చర్యములకు లోన్చేశాయి...
" త్వరలోనే ప్రయాణం ఉన్నది సోదరులారా...!
ఇది మరి ఒక కొత్త ప్రారంభము.
స్త్రీలను పిల్లలను జాగ్రత్తగా చేసి ప్రయాణానికి సిద్ధం కండి..."
అమితమైన ఆనందంతో కన్నుల వెంట నీరు వచ్చుచుండగా ఆజ్ఞాపించాడు తక్షకుడు.
తమ రారాజు మాటను తమ రారాజుకు కుడి భుజమైన మహామంత్రి మాటను కాదని అలవాటు సభలో ఎవ్వరికీ లేదు..
తక్షకునికి మనసారా నమస్కరించి తమ తమ వాసములకు బయలుదేరినారు సభా సదులు అందరూ
బలరాముడు తమకు వరమిచ్చాడని అర్థమై...
@@@@@@@@
" సర్..!"
ఉద్వేగం మొత్తం తన కంఠంలోనే ఉన్నట్లుగా అరచి పిలిచినది ఆమె...
ఆ పిలుపులో ఆత్రుతను తన మెదడు స్వీకరించినట్లుగా చేస్తున్న పని ఆపి పైకి లేచాడా నడవ వయసు వ్యక్తి.
అతని చేతిలో భూతద్దం మామూలుగా కంటే పెద్ద సైజులో ఉండి వింతగా మెరుస్తూ ఉంది ఏదో జంతువు యొక్క దంతంతో చేసినట్లు.
కంటికి ఉన్న అర్థ చంద్రకారపు కళ్ళజోడు మెడలో వేసుకున్న నీలిరంగు ముత్యాల వంటి పూసలమాల మరియు అతని శరీరాన్ని చుట్టుకుని ఉన్న పార్క్ అవెన్యూ బట్టలు అతని రెండు కాలాలకి మధ్య ప్రతినిధి లా చూపిస్తున్నాయి.
" ఏమైంది..!?"
చాలా ప్రశాంతంగా అడిగాడు అతను.
" ఈ మ్యాప్ లో ఏదో కోడ్ ఉంది.
బహుశా ఈ కోడ్ను చేదిస్తే మనకు జాక్పాట్ దొరకచ్చు.."
కళ్ళజోడు ముక్కు పైనుండి పైకి తోసుకుంటూ చెప్పింది అంతకు ముందు అతని పిలిచిన ఆమె.
" కోడ్...!??"
ఆశ్చర్యంగా ఒకింత అసహనంగా అడిగాడు ఆ రెండు కాలాల మనిషి.
" ఎస్ ..!
కోడ్..!!"
అంతే కాన్ఫిడెంట్గా అన్నది ఆమె.
ఆమె కంఠంలో వినిపించిన నమ్మకానికి తలంచి తాను కూడా అదే మ్యాపులోకి చూస్తూ ఆలోచనలో పడిపోయాడు రెండు కాలాల మనిషి.
ఇంతకీ వీరిద్దరూ ఎవరు..,??
ఆ మ్యాప్ దేనికి సంబంధించింది...?
ఇంతకీ బలరాముడు ఇచ్చిన వరం ఏమిటి..??
హలో అందరికీ.
నమస్తే..,!!
ఈ ప్లాట్ఫామ్ మీద నేను రాస్తున్న మొదటి నవల ఇది.
దయచేసి నన్ను ఆదరించి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే
మన్నించి నా కథని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.