రుద్ర భైరవ మనుషులు అర్జున్ ను బెదిరించి వెళ్ళిన తర్వాత, వేదకు ప్రమాదం ఎంతలా ఉందో అర్జున్ కు అర్థమైంది.
అదే రోజు సాయంత్రం ఇటు వేద ఉంటున్న చిన్న గదిలో మౌనం భారంగా అనిపిస్తోంది. కిటికీ బయట మేఘాలు కమ్ముకుని చినుకులు పడుతుంటే, లోపల ఒక తుఫానుకు ముందున్న నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
వేద తన గురించి అర్జున్ కు తెలిసి, తనను వెతుకుతూ వచ్చిన విషయం గురించి చింతిస్తూ ఉంది. ఇంతలో, అర్జున్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు.
అతని మోచేతికి కట్టిన తెల్లటి కట్టు మీద ఇంకా రక్తపు చారలు కనిపిస్తున్నాయి. ముఖం మీద గీసుకుపోయిన గాయాలు, చెదిరిన జుట్టు..
అతని కళ్లలో మాత్రం తను చూసిన నిజాన్ని నిలదీయాలన్న పట్టుదల స్పష్టంగా ఉంది.
అర్జున్ రావడాన్ని చూసిన వేద, అతనికేలా తను ఉండే చోటు తెలిసింది అని ఆశ్చర్యంతో 'ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా!' అని మనసులో అనుకున్నా, ఏమీ మాట్లాడలేక మూగబోయింది.
నేరుగా వేద కళ్లలోకి చూస్తూ, "వేద.. మనం మాట్లాడుకోవాలి!" అన్నాడు అర్జున్.
అంతవరకు ఆశ్చర్యంతో మూగబోయిన, ఉన్నట్టుండి వేద ఉలిక్కిపడి లేచింది. అర్జున్ గాయాలను చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. "ఏ.. ఏ.. ఏమైంది నీకు? ఆ గాయాలేంటి?" అని కంగారుగా ముందుకు వచ్చింది.
కానీ అర్జున్ ఒక అడుగు వెనక్కి వేసి ఆమెను ఆపాడు. "ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం నా గాయం గురించి కాదు వేద, నీ గురించి!" అన్నాడు.
"నా గురించా..?" అంటూ అర్జున్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది వేద.
"అవును వేద.. ఈ గాయాలు నాకు తగలవలసినవి కాదు, నీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో జరిగిన దాడికి రుజువులు ఇవి..!"
అది విన్న వేద కంగుతింది. "ఏంటీ, నావల్ల మీపై దాడి జరిగిందా..? ఎవరు వాళ్ళు?" అంటున్న వేద గొంతులో భయం మొదలైంది.
"నేను కూడా అది తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను.. అసలు ఎవరు నువ్వు, నీ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి?" అని అడిగాడు అర్జున్.
అందుకు ఏం చెప్పాలో తెలియక వేద నిశ్శబ్దంగా ఉండిపోయింది.
"ఒకవేళ వీడియోలో చూసింది నిజం కాకపోయినా, ఆ ఇనుప రేకు.. నువ్వు దాన్ని వెన్నలా వంచేయడం నేను కళ్లారా చూశాను. అసలు నువ్వు మామూలు అమ్మాయివేనా?" అని అంటున్న అతని గొంతులో ఆవేశం, అంతకంటే ఎక్కువ అయోమయం ఉన్నాయి.
అంతవరకు మౌనంగా ఉండిపోయిన వేద లోపల ఏదో విచ్ఛిన్నమవుతోంది అన్నట్టు అనిపించింది.
'నన్ను నిరంతరం ఎవరో గమనిస్తున్నారా? నా గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఇతనిపై దాడి చేశారా..?'
ఇలాంటి ప్రశ్నలు తన మనసులో పరుగులు తీస్తున్నాయి.
'ఇతను ఇలాగే నావెంట పడితే, నా గురించి తెలుసుకుంటే, తన ప్రాణాలకే ప్రమాదం. ఏదో ఒకటి చేసి ఇతన్ని నా నుండి దూరం పెట్టాలి!' అని అనుకుంటూ అర్జున్ ను ఎలా అయినా సరే దారి మళ్ళించాలి అనుకుంది.
"చూడండి మిస్టర్.." అంటూ వేద ఆగిపోయింది.
"మీరు నేను అర్జున్ అని పిలవచ్చు.. నేనొక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్." అని మొదటిసారిగా వేదకు తన గురించి చెప్పాడు.
వేద స్థిరమైన స్వరంతో "మిస్టర్ అర్జున్! మీకు నిజం తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చూడు" అంటూ అలమరాలోంచి ఒక పాత ఫైల్ తీసి అతని ముందు పడేసింది.
అర్జున్ అనుమానంగా ఆ ఫైల్ తెరిచాడు. అందులో ఆమె చిన్నప్పటి నుండి చేయించుకున్న రకరకాల స్కాన్లు, మెడికల్ రిపోర్టులు ఉన్నాయి.
"నీకు కనిపించింది బలం కాదు అర్జున్.. అది నా దౌర్భాగ్యం." అంది వేద, కిటికీ వైపు తిరిగి నిలబడి.
"నాకు చిన్నప్పటి నుండి ఒక అరుదైన నర్వస్ డిసార్డర్ ఉంది. వైద్య పరిభాషలో దీన్ని 'Hyper-adrenal response' అంటారు. నా మెదడులో ఏదో తెలియని ఒత్తిడి కలిగినప్పుడు నా శరీరంలో అడ్రినలిన్ అమాంతం పెరిగిపోతుంది. ఆ సమయంలో నా కళ్లు ఎర్రబడతాయి, కండరాల శక్తి ఒక రాక్షస స్థాయికి చేరుకుంటుంది. కానీ ఆ తర్వాత నేను అనుభవించే నరకం నీకు తెలియదు. నా శరీరమంతా వేడితో ఉడికిపోతుంది, నరాలు తెగిపోయేలా నొప్పి వస్తుంది. ఆ ఇనుప రేకును వంచింది నేను కాదు, నాలోని జబ్బు!" అని వివరించింది వేద.
అర్జున్ ఆ రిపోర్టులను నిశితంగా పరిశీలించాడు. అందులో ప్రతి పేజీ మీద హాస్పిటల్ సీల్స్, డాక్టర్ సంతకాలు స్పష్టంగా ఉన్నాయి. 'డాక్టర్ శివరామ్ - సీనియర్ న్యూరో సర్జన్' అని అక్షరాలు మెరుస్తున్నాయి.
ఆ క్షణం వేద పడుతున్న వేదన, కన్నీళ్లు చూస్తుంటే అర్జున్ మనసు కరిగింది. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కంటే, ఒక మనిషిగా అతనిలో పశ్చాత్తాపం మొదలైంది.
ఒక అమ్మాయి తన జబ్బును తలచుకుని బాధపడుతుంటే, తను దాన్ని ఒక మిస్టరీ అనుకుని వెంటాడటం ఎంత తప్పు అనిపించింది.
"క్షమించు వేద.. నీ మీద ఉన్న ఆ నెగటివ్ వీడియో, ఆ మనుషులు నాపై దాడి చేయడం.. ఇవన్నీ చూసి నేను వేరే ఏదో అనుకున్నాను." అని అర్జున్ మెల్లగా అన్నాడు.
"పర్వాలేదు అర్జున్.. ఇప్పటికైనా నన్ను వదిలేయండి. నా జీవితం ఇప్పటికే అబద్ధాల మీద, ఈ వైద్యం అనే సాకు మీద సాగుతోంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి." అంటూ వేద వెక్కిళ్లు పెడుతూ చెప్పింది.
అందుకు అర్జున్ మౌనంగా తల వంచుకొని, అక్కడి నుండి భారంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వెంటనే, వేద గది తలుపు గడియ పెట్టి నేలపై కుప్పకూలిపోయింది.
భయంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ ఫైల్ తీసి గుండెలకు హత్తుకుంది. అవి ఫేక్ రిపోర్టులు.
తన తల్లిదండ్రులు తనలోని ఆధ్యాత్మికమైన ఉగ్రతను లోకం నుండి దాచడానికి, ఆమెను ఒక 'రోగి'గా చిత్రించి సృష్టించిన మాయాజాలం అది.
'అమ్మా.. నన్ను క్షమించు. నా ఉనికిని కాపాడుకోవడానికి నేను ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలి? నా లోపల ఉన్న ఈ మంటను ఇంకా ఎంతకాలం ఇలా దాచుకోవాలి?' అని కుమిలిపోయింది.
ఆ గదిలోని చీకటిలో ఆమె నీడ గోడ మీద ఒక వింత ఆకారంలా కనిపిస్తోంది.
మరోవైపు, వేద ఇంటినుండి బయలుదేరిన అర్జున్ తన బైక్ మీద వెళ్తున్నాడు. మనసులో వేద కన్నీళ్లు కదలాడుతున్నా, అతని జర్నలిస్ట్ బుర్ర మాత్రం ఏదో తేడాగా ఉందని హెచ్చరిస్తూనే ఉంది.
ఆ క్షణమే బైక్ ఆపి తన స్నేహితుడు, డాక్టర్ అయిన వికాస్‌కు ఫోన్ చేశాడు.
"వికాస్.. నీకొక మెడికల్ రిపోర్ట్ పంపుతాను, ఒక్కసారి చూస్తావా? అది డాక్టర్ శివరామ్ అని సిటీలో పేరున్న న్యూరో సర్జన్ ఇచ్చింది." అన్నాడు అర్జున్.
కొద్దిసేపటి తర్వాత వికాస్ నుండి కాల్ వచ్చింది. అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తోంది.
"అర్జున్.. నువ్వు పంపిన ఆ రిపోర్టులో సంతకం చేసిన డాక్టర్ శివరామ్ గురించి చెక్ చేశాను. ఆయన ఒకప్పుడు సిటీలోనే టాప్ డాక్టర్. కానీ ఒక చిన్న సమస్య ఉంది.." అంటూ ఆగిపోయాడు వికాస్.
"ఏంటది వికాస్?" అని అర్జున్ గుండె వేగంగా కొట్టుకోసాగింది.
"ఆయన మూడేళ్ల క్రితమే ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అర్జున్. మరి ఇవాళ నీకు ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? అందులో ఉన్న డేట్స్ అన్నీ పాతవి కాదు, లేటెస్ట్గా ఉన్నాయి!"
అది విన్న అర్జున్ చేతిలోని ఫోన్ ఒక్క క్షణం జారిపోయినంత పనైంది. అతని కళ్లముందు వేద ఏడుస్తున్న ముఖం మెదిలింది.
"అంటే వేద తన అనారోగ్యం గురించి చెప్పింది మొత్తం ఒక కట్టుకథనా..?"
ఆ కన్నీళ్లు నిజమైతే.. మరి ఈ అబద్ధం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఆమె ఎందుకు దాస్తోంది?
మరి అర్జున్ ఈ కొత్త నిజాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు? వేద గదిలో ఉన్న ఆ రహస్య ఫైల్ వెనుక ఇంకా ఏముంది?
మరిన్ని మలుపులతో వచ్చే ఎపిసోడ్ లో…