మేనార్‌లోని ఆ పాత గదుల్లో నిశ్శబ్దం గూడు కట్టుకుంది. అర్జున్ చేతిలో ఉన్న ఆ ఫోటో, దాని వెనుక "ద్వారపాలిక రక్షణ” అని రాయబడి ఉన్న ఆ అక్షరాలు అతని మెదడులో ఒక తుఫానును సృష్టిస్తున్నాయి. కానీహఠాత్తుగా బయట వినిపిస్తున్న ఒక వింతైన శబ్దం ఆ ఆలోచనల నుండి అతన్ని బయటకు లాగింది.
అప్పటి వరకు సాధారణంగా ఉన్న సాయంత్రం ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. వేద బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తుండగా, ఆమె కళ్లు నమ్మలేనట్టుగా వెడల్పయ్యాయి.
అక్కడ కనిపిస్తున్న ఆకాశం నీలంగా లేదు.. పోనీ నల్లగానూ లేదు. అచ్చం ఎవరో రక్తాన్ని కుమ్మరించినట్టు అది చిక్కటి ఎరుపు రంగులోకి మారిపోయింది. అది సూర్యాస్తమయం వెలుగులా కాకుండా, ఒక హెచ్చరికలా ఉంది. మేనార్ చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో నుంచి పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలోకి ఎగిరాయి. కానీ అవి ఎటు వెళ్లాలో తెలియక పిచ్చివాటిలా మేనార్ గోడలకు తగిలి ప్రాణాలు వదులుతున్నాయి.
అలా చనిపోయి నేల మీద పడుతున్న ఆ పక్షుల శబ్దాలు వేద గుండెలో దడ పుట్టిస్తున్నాయి. అక్కడి గాలిలో ఒక రకమైన ఘాటైన, కుళ్లిన మాంసం వాసన వస్తోంది.
అదంతా గమనిస్తున్న వేద, "ఈ ప్రకృతి కూడా నన్ను చూసి రోదిస్తోందా? లేక ఇది ఏదైనా ముంచుకొస్తున్న ప్రమాదానికి సంకేతమా? నా రక్తంలోని సెగ ఆకాశానికి కూడా అంటుకుందా ఏంటి?" అంటూ ఆమె తనలో తాను గొణుక్కుంటుండగా, మరోవైపు ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. ఆ అభద్రత భావం ఆమెను లోపల నుండి ఆమెను దహిస్తున్నట్టు అనిపించింది.
సరిగ్గా అప్పుడే అర్జున్ భయంతో పరుగున వేద దగ్గరికి వచ్చాడు. "వేద! ఇదంతా ఏంటి? అసలు బయట ఏమవుతోంది?" అని అడుగుతుండగానే.. మేనార్‌లోని లైట్లు ఒక్కసారిగా మినుకుమినుకుమంటూ ఆరిపోయాయి.
అక్కడ మొత్తం చిమ్మచీకటి అలుముకోగా, కేవలం బాల్కనీ నుండి వస్తున్న ఆ రక్త వర్ణపు వెలుతురు మాత్రమే హాలులో పడుతోంది. అంతలో, హాలు మధ్యలో నల్లటి పొగ ఒకటి సుడిగుండంలా తిరగడం మొదలై, ఆ పొగ మెల్లగా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అది రుద్ర భైరవ! కానీ అతను అక్కడ స్వయంగా లేడు, అదొక నీడ మాత్రమే.. ఆ నీడ అతని యొక్క మాయా ప్రతిరూపం.
ఆ నీడ కళ్లు నిప్పు కణికల్లా మెరుస్తూ, "యుగాల నిరీక్షణ ముగియబోతోంది వారసురాలా.." అని అన్న ఆ గొంతు మనిషిలా కాకుండా, అది పాతాళం నుండి వినిపిస్తున్న భీకర నాదంలా ఉంది. "ఆ శరభేశ్వరుడు వేసిన బంధనం విడిపోయే సమయం దగ్గరపడింది. నీ రక్తంలోని ఉగ్రతకు విముక్తి లభించబోతోంది. రాబోయే యుగంతానికి సిద్ధంగా ఉండు!" అని వికృతంగా నవ్వుతున్న అతని స్వరం అక్కడ మారుమ్రోగింది.
అక్కడ జరుగుతున్నది చూడగానే అర్జున్ ఉన్నచోటే ఓ రాయిలా స్తంభించిపోయాడు. అతని లాజిక్, అతను నమ్మిన జర్నలిజం.. అన్నీ ఆ క్షణం కుప్పకూలిపోయాయి. "నేను నా కళ్ళతో చూస్తున్నదంతా నిజమేనా? ఒక మనిషి మాయా రూపంలో వచ్చి హెచ్చరించడమా? అసలు ఇలాంటి శక్తులని మేమెలా ఎదిరించగలం? నాన్న దేని గురించి అయితే హెచ్చరించారో, ఆ విపత్తు ఇదేనేమో.." అని అతని మనసు అరుస్తోంది.
రుద్ర భైరవ ప్రతిరూపం వేద వైపు ఒక అడుగు వేయగా, ఆ క్షణం వేదకు గాలి అందడం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె శరీరంలోని ప్రతి కణం గజగజ వణికిపోతూ, ఆమె రక్తంలో ఏదో వేడి ద్రవం ప్రవహిస్తున్నట్టు, ఎముకలు కాలిపోతున్నట్టు ఒక భయంకరమైన నొప్పి కలిగింది.
తను ఒక సాధారణ అమ్మాయి కాదని, గొప్ప శక్తిమంతురాలని, తనలో ఉగ్రత యొక్క విధ్వంస శక్తి ఉందని ఆమెకు తెలుసు. కానీ తన శత్రువు యొక్క ఈ భయంకరమైన ఉనికి ముందు తాను ఎంత అల్పమైనదో ఆమెకు మొదటిసారి అర్థమైంది. భయం ఆమె గొంతును నొక్కేస్తూ, ఉన్నట్టుండి శక్తిహీనంగా మోకాళ్ల మీద కుప్పకూలిపోయింది వేద.
"అతని కేవలం ఒక నీడ చూపులోనే ఇంత శక్తి ఉంటే.. ఇక అసలు సిసలు రాక్షసుడిని నేను ఎలా ఎదుర్కోగలను? ఇది నా వల్ల కాదు.. నేను అతని ముందు నిలువలేను.." అంటూ వేద కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ నిస్సహాయత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అంతలో, "ఓం శరభాయ నమః..!" అంటూ ఒక్కసారిగా గురుస్వామి గంభీర స్వరంతో మంత్రం పఠిస్తూ హాలులోకి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న పురాతన దండాన్ని నేల మీద గట్టిగా కొత్తగా, ఆ శబ్దం మేనార్ మొత్తాన్ని కుదిపేసింది. ఆ తర్వాత ఆయన చుట్టూ ఒక నీలి రంగు కాంతి వలయంలా ఏర్పడి, గురుస్వామి మంత్రబలం ఆ నల్లటి పొగను, రుద్ర భైరవ ప్రతిరూపాన్ని వెనక్కి నెట్టేస్తోంది.
రుద్ర భైరవ యొక్క మాయా నీడ మెల్లగా కరిగిపోతూ, "ఇది కేవలం ఆరంభం మాత్రమే గురుస్వామి! ఆపలేరు.. జరగబోయేది ఎవ్వరూ ఆపలేరు!" అని అరుస్తూ మాయమైపోయింది.
ఆ వెంటనే అర్జున్ కింద పడున్న వేద దగ్గరికి వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. "వేద! వేద.. కళ్లు తెరువు. ఆ నీడ వెళ్ళిపోయింది.. నీకేమీ కాలేదు.." అంటున్న అతని స్వరం ఆమెకు ఒక చిన్న ఆసరాను ఇచ్చింది.
అక్కడే ఉన్న గురుస్వామి ఆయాసపడుతూ, "ఆ దుష్ట శక్తి ద్వారం దగ్గరకు వచ్చేసింది. మన దగ్గర ఇపుడు ఎక్కువ సమయం లేదు. మన ధైర్యమే మనకు అస్త్రంగా సిద్ధం చేసుకోవాలి." అన్నారు గంభీరంగా.
రుద్ర భైరవ నీడ మాయమైపోయింది కానీ, అక్కడి వాతావరణం మాత్రం ఇంకా ప్రశాంతంగా మారలేదు. ఆకాశం ఇంకా ఆ ఎరుపు రంగులోనే నిండి ఉంది. ముగ్గురూ ఒకరినొకరు చూసుకుంటూ తేరుకునే లోపే.. మేనార్ పునాదుల నుండి ఒక భయంకరమైన శబ్దం వినబడింది.
క్రర్రష్క్….
ఆ శబ్దం వినిపించగానే భూమి కంపించడం మొదలైంది. అది మామూలు భూకంపంలా కాకుండా, ఏదో రాక్షస మృగం నేల లోపల నుండి గొలుసులు తెంచుకుని బయటకు రావాలని చూస్తున్నట్టు ఉంది. దానితో గోడలపై ఉన్న పురాతన శిల్పాలు ఒక్కొక్కటిగా విరిగి కింద పడటం ఆరంభించాయి.
అలా కింద పడుతున్న స్థంభాలలో అర్జున్ గట్టిగా ఒక స్తంభాన్ని పట్టుకుంటూ, "ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. కింద ఏదో మేల్కొంటోంది!" అని కేక వేశాడు.
ఆ వెంటనే హాలు మధ్యలో ఉన్న మార్బుల్ నేలపై ఒక్కసారిగా పెద్ద పగులు ఏర్పడింది. ఆ పగులు మెల్లగా సాగుతూ మేనార్ అడుగున ఉన్న నేల లోతుల్లోకి దారి తీస్తోంది. ఆ చీలికలోంచి అగ్నిపర్వతం నుండి వచ్చే లావా వంటి ఎర్రటి వెలుగు బయటకు చిమ్ముతోంది.
అది చూస్తుండగానే గురుస్వామి కళ్లు భయంతో పెద్దవయ్యాయి. భయంతో ఆయన గొంతులో వణుకు పుట్టడం మొదలైంది.
"మొదటి బంధనం బీటలు వారుతోంది! ఏడు బంధనాల్లో మొదటిది విచ్ఛిన్నం అవుతోంది! యుద్ధం మొదలైపోయింది.. ద్వారపాలికా, నీ శక్తిని గుర్తించి దీన్ని ఎలాగైనా సరే ఆపు!" అని గట్టిగా కేకలు వేశారు గురుస్వామి.
ఆ ఎర్రటి వెలుగు వేద ముఖం మీద పడుతుండగా, ఆమె కళ్లలో భయం పోయి మెల్లగా ఒక తెలియని తీవ్రత మొదలైంది. రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె తన చేతులను గట్టిగా ముడిచింది.
యుద్ధం.. ఇప్పుడే మొదలైంది.