ఆలోచనల తుఫాను
నా హృదయం, నా ప్రాణం, ఆలోచనల యుద్ధంలో…
నా ఆలోచనలు నన్ను గెలవాలని ప్రయత్నిస్తున్నాయి… ఈ క్షణంలో నా మనసు, నా ప్రాణం నా నియంత్రణలో లేవు… మీకూ ఇలా జరిగిందా?
బదులు తోచని ఆలోచనల తాకిడిలో నా మనసు అలసిపోయింది…
ఈ ఆలోచనల్లో బాధ తప్ప ఆనందం కనిపించడం లేదు.
తలిస్తే కోపం, మరిస్తే ప్రశాంతత.
ఈ అంతుచిక్కని సముద్రం లాంటి ఆలోచనల్లో మునిగిపోవాలా?
లేదా చిన్న చెక్క ముక్కలా తేలుతూ అందునుండి బయటపడాలా?
ఎంత పో పో అని తోసినా,
ఈ ఆలోచనలు నా మెదడును పొగలా అలుముకోవడమే కాకుండా,
నిద్రపోతున్న నా హృదయాన్ని కూడా లాగుతున్నాయి.
నాకు - నా ఆలోచనలకు జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచిన ఆలోచనలు, ఇప్పుడు నా దేహాన్ని పూర్తిగా ఆక్రమించాయి.
నా వెంట అడుగులు వేసే నా నీడే
నా బాటని తన బాటగా మార్చుకుంటూ,
నాలోని చీకటిగా మారి,
నాతోనే తిరుగుతూ,
నన్నే ఓడించి - నా ఆక్రోశాన్ని మరింత పెంచుతోంది.
ఈ క్షణంలో,
నా లోపల ఒక మౌన యుద్ధం చెలరేగుతున్నట్టుగా అనిపిస్తోంది.
చురకత్తిలా నన్నే చూస్తూ,
చనిపోయిన నా ప్రాణాన్ని మళ్లీ మళ్లీ పొడిచి చంపే ఆలోచనలు…
వీటిని వదిలేయాలని నా మనసు ఎంత వేడుకున్నా,
గూడు దాటని పక్షిలా ఈ ఆలోచనలు నన్ను విడిచిపెట్టడం లేదు.
ఈ ఆలోచనల కారాగారంలో ఖైదీ అయిన నేను…
ఇప్పటికీ విముక్తి కోసం పోరాడుతూనే ఉన్నాను.
#ఆలోచనలు #మనసు #జీవితం #భావాలు #ప్రేరణ